త్వరలో అందుబాటులోకి రైతు బజారు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:52 AM
నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్న స్థానిక రైతు బజారులో మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రూ.3 కోట్ల వ్యయంతో కూటమి ప్రభుత్వం నిర్మించిన ఈ రైతు బజారును గత నెలలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ రైతు బజారులో దుకాణాల కేటాయింపు ప్రక్రియ మిగిలి ఉంది.
- అద్దె ఖరారుపై ఉన్నతాధికారులకు నివేదిక
- అనుమతి రాగానే దుకాణాల కేటాయింపు
- 72 స్టాళ్లు సిద్ధం
- తీరనున్న రైతులు, చిరు వ్యాపారుల కష్టాలు
చోడవరం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవం కూడా పూర్తి చేసుకున్న స్థానిక రైతు బజారులో మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. రూ.3 కోట్ల వ్యయంతో కూటమి ప్రభుత్వం నిర్మించిన ఈ రైతు బజారును గత నెలలో ఎంపీ సీఎం రమేశ్, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. కార్యకలాపాలకు పూర్తిస్థాయిలో సిద్ధమైన ఈ రైతు బజారులో దుకాణాల కేటాయింపు ప్రక్రియ మిగిలి ఉంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభమై, వైసీపీ ఐదేళ్ల పాలనలో అసంపూర్తిగా నిలిచిపోయిన పట్టణంలోని రైతు బజారు తిరిగి కూటమి పాలనలో ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు చొరవతో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. నియోజకవర్గ కేంద్రంలో రైతులు, చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయించేందుకు వీలులేక రోడ్డు పక్కనే ఎండకు ఎండి, వానకు తడిసి వ్యాపారాలు చేసుకోవలసిన దుస్థితి ఉంది. రైతు బజారు లేకపోవడంతో చోడవరం పరిసర గ్రామాలకు చెందిన కూరగాయల రైతులు, చిరువ్యాపారులు స్థానిక ఆంధ్రాబ్యాంకు, ప్రేమసమాజం రోడ్డుతో పాటు లక్ష్మీపురం రోడ్డు, ప్రభుత్వ కాలేజీ, కొత్తూరు జంక్షన్లలో విక్రయాలు సాగిస్తున్నారు. రహదారులపై దుకాణాలతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతూనే ఉన్నాయి. కాగా రైతు బజారులో దుకాణాల కేటాయింపు అనంతరం ఇక్కడే రైతులు, చిరువ్యాపారులు తమ వ్యాపారాలు ప్రారంభించడానికి పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.