తుప్పు పడుతున్న సీజ్ వాహనాలు
ABN , Publish Date - Mar 22 , 2026 | 12:28 AM
గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్‌లో తుప్పు పడుతున్నాయి. ఈ వాహనాలను విడిపించుకునేందుకు సంబంధిత వ్యక్తులు రాకపోవడంతో కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల ఆవరణలో వందల కొలదీ వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వీటిని భద్రపరిచేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ వాహనాలు ప్రతీ ఆరు మాసాలకు ఒక పర్యాయం వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు.
పోలీస్ స్టేషన్ల వద్ద గుట్టలుగా
గంజాయి, ప్రమాదాల వాహనాలు
కొయ్యూరు, మంప స్టేషన్లలో
15 ఏళ్లుగా పేరుకుపోయిన వైనం
ప్రతీ ఆరు నెలలకు వేయని వేలం
ప్రభుత్వ ఆదాయానికి గండి
పోలీసులకు తలనొప్పి
కొయ్యూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):
గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పోలీస్ స్టేషన్‌లో తుప్పు పడుతున్నాయి. ఈ వాహనాలను విడిపించుకునేందుకు సంబంధిత వ్యక్తులు రాకపోవడంతో కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల ఆవరణలో వందల కొలదీ వాహనాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. వీటిని భద్రపరిచేందుకు పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ వాహనాలు ప్రతీ ఆరు మాసాలకు ఒక పర్యాయం వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవు.
కొయ్యూరు, మంప పోలీస్ స్టేషన్ల పరిధిలో 2012 సంవత్సరం నుంచి వివిధ కేసుల్లో సీజ్ చేసిన కార్లు, లారీలు, వ్యాన్‌లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వందలాది ఉన్నాయి. ఈ వాహనాలన్నీ కొయ్యూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది నివాస గృహాల ముందు, వెనుక స్థలాల్లో ఉన్నాయి. ఇవి వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. తుప్పు పడుతున్నాయి. ప్రమాద బారిన పడినవి అయినా.. లేదా ఇతర కారణాలతో సీజ్ చేసినవి ఉన్నాయి. గంజాయి రవాణా సమయంలో పైలట్‌గా వ్యవహరించే వారి వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని విడిపించుకునేందుకు చట్టపరంగానూ, న్యాయపరమైన ఇబ్బందులు ఎక్కువ. దీంతో ఆ వాహనాలను విడిపించుకునేందుకు యజమానులు ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పెరుగుతూ గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. వీటి లోపలకు విష సర్పాలు చేరుతుండడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాగా వివిధ కేసుల్లోనూ, ప్రమాదవశాత్తూ స్టేషన్‌కు తీసుకువచ్చిన వాహనాలను రెవెన్యూ అఽధికారుల సమక్షంలో పంచనామా చేసి ప్రతి ఆరు నెలలకు ఒకసారి బహిరంగ వేలం వేయాలి. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ ఆ దిశగా చర్యలను చేపట్టడం లేదు. ఈ వాహనాలకు వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు చేపడితే మంచిదని పలువురు పేర్కొంటున్నారు.