Share News

గ్యాస్‌ కోసం పడిగాపులు

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:05 AM

పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం వంట గ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసి 15 రోజులు దాటినా సరఫరా కావడం లేదు. శనివారం నాటికి మునిసిపాలిటీలో 2,001 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,800 మందికి బుక్‌ చేసుకున్న గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంది. ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీకి సంబంధించిన 2,584 మంది వినియోగదారులు వంట గ్యాస్‌ ఎప్పుడు సరఫరా చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు.

గ్యాస్‌ కోసం పడిగాపులు
హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద బారులుతీరిన వినియోగదారులు

- బుక్‌ చేసి 15 రోజులు దాటినా సరఫరా కాని వైనం

- కొరత లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నం

-- కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఖాళీ

- కట్టెలకు పెరిగిన డిమాండ్‌

- టన్ను రూ.2300 నుంచి రూ.3 వేలకు పెరిగిన ధర

నర్సీపట్నం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావం వంట గ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వినియోగదారులు గ్యాస్‌ బుక్‌ చేసి 15 రోజులు దాటినా సరఫరా కావడం లేదు. శనివారం నాటికి మునిసిపాలిటీలో 2,001 మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 1,800 మందికి బుక్‌ చేసుకున్న గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేయాల్సి ఉంది. ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీకి సంబంధించిన 2,584 మంది వినియోగదారులు వంట గ్యాస్‌ ఎప్పుడు సరఫరా చేస్తారా? అని ఎదురు చూస్తున్నారు.

ఉన్నతాధికారులు వంట గ్యాస్‌ కొరత లేదంటున్నారు. క్షేత్ర స్థాయిలో చూస్తే వినియోగదారులు వంట గ్యాస్‌ కోసం పడిగాపులు కాస్తున్నారు. రెండు రోజుల క్రితం వరకు హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీకి 504, అలాగే 342 సిలిండర్లు చొప్పున రెండు లోడ్లు పంపేవారు. ఇప్పుడు 504 సిలిండర్లుతో ఒక లోడు మాత్రమే పంపుతున్నారు. చమురు కంపెనీలు డొమెస్టిక్‌ సిలిండర్లు సరఫరా కూడా తగ్గించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో విడిపించిన సిలిండర్లు సరాసరి చేసి పొదుపుగా వంట గ్యాస్‌ పంపుతున్నారు. అవసరం లేకపోయినా వినియోగదారులు బుక్‌ చేస్తున్నారని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు విమర్శిస్తున్నారు. 6, 7 తేదీల్లో బుక్‌ చేసుకున్న వారికి శనివారం హెచ్‌పీ గ్యాస్‌ డెలివరీ చేస్తున్నారు.

వాణిజ్య సిలిండర్ల నిల్వలు ఖాళీ

వాణిజ్య సిలిండర్లు నిల్వలు ఖాళీ అయిపోయాయి. చమురు కంపెనీలు వాటిని సరఫరా చేయలేమని చేతులు ఎత్తేశాయి హెచ్‌పీ, ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీలకు వాణిజ్య సిలిండర్లు సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి. దీని వలన అన్ని రకాల హోటళ్లు మూత పడే పరిస్థితి వస్తున్నది. శనివారం నర్సీపట్నం- చింతపల్లి రోడ్డులోని శాంతిసాయి మాంసాహార హోటల్‌ మూత పడింది. పెద్ద హోటళ్లు కట్టెల పొయ్యిలు అమర్చుకున్నారు. కొన్ని హోటళ్లలో చాటుమాటుగా డొమెస్టిక్‌ సిలిండర్లు వాడుతుండడంతో సమస్య తీవ్రత బయట పడలేదు. వాణిజ్య సిలిండర్ల కొరత వలన రెండు మూడు రోజుల్లో హోటళ్లు మూత పడే పరిస్థితి ఉందని పలువురు యజమానులు అంటున్నారు.

వంట చెరుకుకు డిమాండ్‌

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లు దొరక్కపోవడంతో హోటళ్ల యజమానులు కట్టెలను ఆశ్రయిస్తున్నారు. పెద్ద హోటళ్ల వద్ద ఉన్న సిలిండర్లు స్టాక్‌ అయిపోయే పరిస్థితి ఉంది. దీని వలన వంట చెరుకుకు డిమాండ్‌ పెరిగి ధరలు పెంచేస్తున్నారు. టన్ను కట్టెలు రూ.2,300లు నుంచి ఒకేసారి రూ.700 పెంచి రూ.3 వేలుకు విక్రయిస్తున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:05 AM