రిజిస్ట్రేషన్ల జోరు
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:26 AM
గడచిన ఆర్థిక సంవత్సంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి 2025-26లో రూ.331.6 కోట్లు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, రూ.351.62 కోట్లు రాబడి వచ్చింది.
లక్ష్యాన్ని మించిన ఆదాయం
2025-26లో రూ.331.6 కోట్లు టార్గెట్
మరో ఇరవై కోట్లు అదనంగా రూ.351.62 కోట్లు రాబడి
277 శాతంతో నర్సీపట్నం టాప్
15.18 శాతంతో అట్టడుగున మాడుగుల
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గడచిన ఆర్థిక సంవత్సంలో జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి 2025-26లో రూ.331.6 కోట్లు ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించగా, రూ.351.62 కోట్లు రాబడి వచ్చింది. నర్సీపట్నం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం 277 శాతం ఆదాయంతో మొదటి స్థానంలో నిలవగా, కేవలం 15.18 శాతం ఆదాయంతో అట్టడుగున నిలిచింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం, పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో భూములు, ఇతర స్థిరాస్తులు క్రయవిక్రయాలు బాగా పెరిగాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వచ్చింది. జిల్లాలో మొత్తం పది సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు వున్నాయి. 2025 ఏప్రిల్ ఒకటి నుంచి 2026 మార్చి 31 వరకు రూ.331.6 కోట్ల ఆదాయం రావాలని ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. అయితే అంచనాలకు మించి రూ.351.62 కోట్లు వసూలైంది. లక్ష్యం కంటే రూ.20.02 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. మాడుగుల, అనకాపల్లి మినహా మిగిలిన ఎనిమిది సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాలు లక్ష్యాన్ని అధిగమించడం విశేషం.
నర్సీపట్నంలో ఆదా లక్ష్యం రూ.10.53 కోట్లు కాగా ఏకంగా రూ.29.17 కోట్లు (277.09 శాతం) వచ్చింది. సబ్బవరంలో రూ.25.12 కోట్లకుగాను 177.5 శాతం అధికంగా రూ.44.6 కోట్లు సమకూరింది. కె.కోటపాడులో రూ.9.6 కోట్లకుగాను రూ.13.02 కోట్లు (135.56 శాతం) వచ్చింది. మిగిలిన నక్కపల్లిలో రూ.34.4 కోట్లకు రూ.41.62 కోట్లు, ఎలమంచిలిలో రూ.36.4 కోట్లకు రూ.47.55 కోట్లు, లంకెలపాలెంలో రూ.52.46 కోట్లకు రూ.59.9 కోట్లు, చోడవరంలో రూ.18.51 కోట్లకు రూ.21.05 కోట్లు, కోటవురట్లలో రూ.14.59 కోట్లకు రూ.17.63 కోట్లు వచ్చాయి. రిజిస్ట్రేషన్ ఆదాయంలో ఎప్పుడూ ముందువరుసలో వుండే అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఈసారి కాస్త వెనుకబడింది. రూ.81.11 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.69.66 కోట్లు మాత్రమే వచ్చింది.. మాడుగులలో రూ.48.88 కోట్లు ఆదాయం లక్ష్యంకాగా కేవలం రూ.7.42 కోట్లు (15.18 శాతం) మాత్రమే వచ్చింది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఆదాయ వివరాలు
కార్యాలయం లక్ష్యం ఆదాయం
అనకాపల్లి రూ.81.11 కోట్లు రూ.69.66 కోట్లు
చోడవరం రూ.18.51 కోట్లు రూ.21.05 కోట్లు
కె.కోటపాడు రూ.9.60 కోట్లు రూ. 13.02 కోట్లు
కోటవురట్ల రూ.14.59 కోట్లు రూ. 17.63 కోట్లు
లంకెలపాలెం రూ.52.46 కోట్లు రూ. 59.90 కోట్లు
మాడుగుల రూ.48.88 కోట్లు రూ. 7.42 కోట్లు
నక్కపల్లి రూ.34.40 రూ.41.62 కోట్లు
నర్సీపట్నం రూ.10.53 రూ.29.17 కోట్లు
సబ్బవరం రూ.25.12 కోట్లు రూ.44.60 కోట్లు
ఎలమంచిలి రూ.36.40 రూ. 47.55 కోట్లు
మొత్తం రూ.331.6 కోట్లు రూ.351.62
వేగవంతమైన సేవలు
మన్మథరావు, జిల్లా రిజిస్ట్రార్
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి కారణంగా రిజిస్ట్రేషన్‌లు పెరుగుతున్నాయి. తద్వారా ఆదాయం కూడా పెరుగుతున్నది. ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేగవంతంతో కూడిన సేవలను అందుబాటులోకి తెచ్చింది. భూముల రిజిస్ట్రేషన్‌ల కోసం కార్యాలయాలకు వచ్చే వారి సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్ సేవలు అందుబాబులో ఉండడం, స్లాట్ బుకింగ్ అమలు చేయడం వల్ల క్రయవిక్రయదారుల్లో నమ్మకం పెరిగింది. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు పెరిగాయి.