అడ్మిషన్లకు హడావిడి
ABN , Publish Date - May 23 , 2026 | 12:08 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడానికి విద్యా శాఖ అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే లక్ష్యం మేర అడ్మిషన్లు జరుగుతాయా అన్న సందేహం కలుగుతున్నది. ప్రభుత్వం విధించిన టార్గెట్‌లో ఇంతవరకు 25 శాతానికి కూడా చేరుకోలేదు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం స్పెషల్ డ్రైవ్
ఇంటింటికీ వెళుతున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, సదుపాయాలపై అవగాహన
పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు వినతి
17,216 మందిని చేర్చాలని లక్ష్యం
ఇంతవరకు నాలుగు వేల మంది చేరిక
స్కూళ్లు తెరిచేలోగా లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారుల ధీమా
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడానికి విద్యా శాఖ అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే లక్ష్యం మేర అడ్మిషన్లు జరుగుతాయా అన్న సందేహం కలుగుతున్నది. ప్రభుత్వం విధించిన టార్గెట్‌లో ఇంతవరకు 25 శాతానికి కూడా చేరుకోలేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తున్నది. ఫౌండేషన్ లెర్నింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రాథమిక స్థాయిలో చదువు, లెక్కల నైపుణ్యాల్లో బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులకు నైపుణ్యాధారిత బోధన, టెక్నాలజీ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు స్పెషల్ డ్రైవ్
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచాలని విద్యా శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఏప్రిల్ నుంచి ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బడిఈడు పిల్లల గురించి ఆరా తీసి, అక్కడికక్కడే దరఖాస్తులు పూర్తిచేయించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. పిల్లలను ఎవరైనా ప్రైవేటు పాఠశాలల్లో చదువుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, మౌలిక వసతులు, ఇంగ్లిషు మీడియంలో బోధన, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారం, బూట్లు, తదితర వాటి గురించి తల్లిదండ్రులకు వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతుండడంతో ఉపాధ్యాయులు, ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అక్కడికక్కడే ప్రవేశ పత్రాలు అందిస్తున్నారు. ఇంకా అంగన్‌వాడీల్లో చదువుతున్న చిన్నారులను ఒకటో తరగతిలో చేర్పిస్తున్నారు. అయితే అనుకున్న మేర ప్రవేశాలు జరగడంలేదు. రానున్న విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 17,216 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకోవాలని లక్ష్యంగా కాగా ఈ నెల 15వ తేదీనాటికి సుమారు నాలుగు వేల మంది మాత్రమే చేరారు. వీరిలో ఒకటో తరగతిలో చేరినవారు 3,255 మంది వున్నారు. పాఠశాలల పునఃప్రారంభానికి ఇంకా మూడు వారాలు గడువు వుండడంతో లక్ష్యం మేరకు ప్రవేశాలు కల్పిస్తామని విద్యా శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం
ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల క్రితం రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్లు, పాఠశాల విద్యా శాఖ ఆర్జేడీలు, ఇతర అధికారులతో సదస్సు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బడి మానేసిన (డ్రాపౌట్) విద్యార్థులు లక్ష మంది ఉన్నారని, అసలు పాఠశాలల్లో చేరనివారు కూడా ఉన్నారని, వీరందరినీ పాఠశాల్లో చేర్పించడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. రానున్న విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 10 శాతం పెరగాలని, ఇందుకోసం ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేలా అధికారులు కృషి చేస్తే కచ్చితంగా ప్రవేశాలు పెరుగుతాయని అన్నారు.
తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యం
గిడ్డి అప్పారావునాయుడు, డీఈఓ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగాలంటే తల్లిదండ్రుల సహకారం ఎంతోముఖ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచడానికి మండల విద్యా శాఖాధికారులు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలు గత నెల రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. రోజూ 70 నుంచి 80 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభంనాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశిస్తున్నాం.