Share News

గ్రామీణ రోడ్లకు మహర్దశ

ABN , Publish Date - Feb 09 , 2026 | 12:28 AM

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఛిద్రమై, అధ్వానంగా మారిన రోడ్లకు దశ మారునున్నది.

గ్రామీణ రోడ్లకు మహర్దశ

పీఆర్‌ ప్రాజెక్ట్సు విశాఖ డివిజన్‌లో 98 రహదారుల అభివృద్ధి

మొత్తం 267.68 కి.మీ.ల పొడవు, రూ.117.08 కోట్లు మంజూరు

అనకాపల్లి జిల్లాలో 81, విశాఖ జిల్లాలో 17 రహదారుల

త్వరలో టెండర్లు.. ఆరు నెలల్లో పనులు పూర్తి

విశాఖపట్నం, ఫిబ్రవవరి 8 (ఆంధ్రజ్యోతి):

పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఛిద్రమై, అధ్వానంగా మారిన రోడ్లకు దశ మారునున్నది. మహర్ధశపట్టింది. ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు(ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ) కింద విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో మొత్తం 98 రహదారులను అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మొత్తం 267.68 కి.మీ.ల పొడవైన రహదారులను పటిష్టం చేయడానికి రూ.117.08 కోట్లు మంజూరుచేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియను చేపట్టి, ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

గత వైసీపీ ఐదేళ్ల పాలనో గ్రామీణ రహదారులు ఎంత అధ్వానంగా వున్నాయో అందరికీ తెలిసిందే. ఒక్క ఏడాది కూడా నిర్వహణ, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంతో క్రమేపీ గోతులు పెద్దవై, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. రహదారులపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడి, వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి పంట కుంటలను తలపించాయి. కొన్ని మార్గాల్లో రాళ్లు లేచిపోయి కనీసం నడిచి వెళ్లడానికి కూడా వీలు కాని విధంగా రహదారులు వుండేవి. రోడ్లను బాగు చేయించాలని ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా.. నాటి వైసీపీ పాలకులు పెడచెవిన పెట్టారు. ఏడాదిన్నర క్రితం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత నిధులు సమకూర్చనున్నది. దీనిలో భాగంగానే ఏపీ రూరల్‌ రోడ్స్‌ స్ట్రెంథనింగ్‌ ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్‌ఎస్‌పీ) కింద పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ప్రాజెక్ట్సు డివిజన్‌ పరిధిలోని విశాఖపట్నం జిల్లాలో 17 రోడ్లు, అనకాపల్లి జిల్లాలో 81 రోడ్లు వున్నాయి. మొత్తం 267.68 కి.మీ.ల పొడవైన 98 రహదారులకు అభివృద్ధి/ మరమ్మతు పనులకు రూ.117.08 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం మూడు రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో అనకాపల్లి జిల్లాలో 226.40 కి.మీ.ల పొడవైన రోడ్లకు రూ.99.63 కోట్లు, విశాఖ జిల్లాలో 41.28 కి.మీ.ల పొడవైన రోడ్లకు రూ.17.45 కోట్లు కేటాయించారు. త్వరలో టెండర్లు పిలిచి, ఆరు నెలల్లో పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

విశాఖ జిల్లాలో

ఆనందపురం మండలంలో బీఎన్‌ రోడ్‌ నుంచి రామవరం, భీమన్నదొరపాలెం మీదుగా జీకే రోడ్డు వరకు .337 కి.మీ.ల మేర రూ.2.83 కోట్లతో మరమ్మతులు

ఆనందపురం మండలంలో కణమాం ఆర్‌బీ రోడ్డు నుంచి యర్రవానిపాలెం మీదుగా బీడీపాలెం వరకు 4.694 కి.మీ.ల రోడ్డుకు రూ.73 లక్షలతో మరమ్మతులు

పెందుర్తి మండలంలో ఎస్‌ఐఎం-కేకేపీ రోడ్‌ నుంచి శీలగట్టు, పెదగాడి మీదుగా చింతగట్ల వరకు 5.210 కి.మీ.ల రోడ్డుకు రూ.1.5 కోట్లతో మరమ్మతులు

భీమిలి మండలంలో జాతీయ రహదారి నుంచి అమనాం మీదుగా జీరుపాలెం వరకు మూడు కి.మీ.ల రోడ్డు మరమ్మతుకు రూ.1.31 కోట్లు

భీమిలి మండలంలో వీపీ రోడ్డు నుంచి లక్ష్మీపురం, సింగన్నబంద మీదుగా నారాయణరాజుపేట వరకు 3.4 కి.మీ.ల రోడ్డుకు రూ.1.5 కోట్లతో మరమ్మతులు

ఆనందపురం మండలం కుసులవాడ నుంచి ఇదే గ్రామంలోని ఎస్సీ కాలనీ వరకు 1.024 కి.మీ.ల రోడ్డు రూ.20 లక్షలతో మరమ్మతులు

అనకాపల్లి జిల్లాలోని రహదారుల్లో కొన్ని..

అనకాపల్లి మండలం కూండ్రం- బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరం మధ్య 1.985 కి.మీ.ల రహదారికి రూ.1.14 కోట్లు

చోడవరం మండలం పీఎస్‌పేట నుంచి తిమ్మనపాలెం, పోలేపల్లి మీదుగా ఆర్‌ఈసీ రోడ్డుకు రూ.5.11 కోట్లు

చోడవరం మండలం గోవాడ నుంచి అంభేరుపురం మీదుగా ఆర్‌ఆర్‌పేట వరకు రూ.2 కోట్లు

కశింకోట- బంగారుమెట్ట (కేబీ) రోడ్డు నుంచి పెదమదీనా, గునిపూడి మీదుగా ఆర్‌ఈసీ వరకు రూ.1.6 కోట్లు

దేవరాపల్లి నుంచి వాలాబు, పినకోటలను కలుపుతూ చీడికాడ మండలం కోనాం వరకు 12.35 కి.మీ.ల రహదారికి రూ.6.31 కోట్లు

నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై గొడిచర్ల జంక్షన్‌ నుంచి జి.జగన్నాథపురం మీదుగా గిరిజన గ్రామం చీడిక వరకు 6.458 కి.మీ.ల రోడ్డుకు రూ.2 కోట్లతో మరమ్మతు పనులు

కోటవురట్ల మండలంలో గొట్టివాడ జంక్షన్‌ నుంచి గిరిజన గ్రామం అణుకు వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డుకు రూ.3 కోట్లు

సబ్బవరం మండలంలో బీఎన్‌రోడ్‌ నుంచి ఒమ్మివానిపాలెం మీదుగా ఏఎస్‌పల్లి వరకు 8.15 కి.మీ.ల రోడ్డు మరమ్మతులకు రూ.1.1 కోట్లు

Updated Date - Feb 09 , 2026 | 12:28 AM