గిరి రైతుకు దిగుబడుల చింత!
ABN , Publish Date - Apr 07 , 2026 | 11:39 PM
మన్యంలోని గిరిజన రైతులకు ఈ ఏడాది చింతపండు దిగుబడులు తీవ్ర నిరాశకు గురి చేశాయి. దాదాపుగా మిరియాల దిగుబడుల తరహాలోనే గతేడాది అతి వర్షాల కారణంగానే ఏజెన్సీలో చింత పంటకు ఘోరంగా దెబ్బ తగిలింది.
మిరియాల తరహాలోనే వర్షాలతో దెబ్బతిన్న చింత పంట
గతంతో పోల్చితే ఈ ఏడాది 30 శాతం రాని దిగుబడి
ధర ఆశాజనకంగా ఉన్నా దిగుబడి లేక నష్టపోయిన రైతులు
కిలో రూ.100 చొప్పున కొనుగోలు చేస్తున్న వర్తకులు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలోని గిరిజన రైతులకు ఈ ఏడాది చింతపండు దిగుబడులు తీవ్ర నిరాశకు గురి చేశాయి. దాదాపుగా మిరియాల దిగుబడుల తరహాలోనే గతేడాది అతి వర్షాల కారణంగానే ఏజెన్సీలో చింత పంటకు ఘోరంగా దెబ్బ తగిలింది. దీంతో 30 శాతం దిగుబడి రాని దుస్థితి నెలకొంది. ధర ఎంతో అశాజనకంగా ఉన్నా ఆశించిన దిగుబడి లేకపోవడంతో గిరిజన రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రస్తుతం కిలో రూ.100కు ఇక్కడ వర్తకులు కొనుగోలు చేస్తున్నప్పటికీ ఆశించిన దిగుబడి లేకపోవడంతో తమకు లాభం కలగలేదనే వేదన రైతుల్లో నెలకొంది.
గతేడాది ఏజెన్సీలో ఊహించని విధంగా వర్షాలు కురిశాయి. ఆఖరుకు వేసవి అయిన ఏప్రిల్ నెలలో సైతం వర్షాలు పడ్డాయి. దాదాపుగా ఏప్రిల్ మొదలుకుని నవంబరు వరకు సాధారణ వర్షాలతో పాటు అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో నిత్యం వర్షాలు కురవడంతో చింత పంటకు తీవ్ర నష్టం కలిగింది. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో చింతపూత మొదలై మే, జూన్ నెలల్లో పిందె ఏర్పడుతుంది. ఆయా సమయాల్లో ఒక మోస్తరు మినహా భారీ వర్షాలు కురిస్తే పూత, పిందె సైతం దెబ్బతింటుంది. గతేడాది అదే జరిగింది. ఏప్రిల్ నుంచి కురిసిన భారీ వర్షాలకు చింత పూత, పిందె దశల్లోనే మొత్తం నాశనమైపోయింది. దీంతో చింతపండు దిగుబడిని పూర్తిగా దెబ్బతీశాయి.
హుద్‌హుద్ తర్వాత పెరిగిన డిమాండ్
నిత్యావసరంగా వంటల్లో వినియోగించే చింతపండుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో, దానిని ఆనుకుని ఉన్న మైదాన ప్రాంతాలైన చీడికాడ, వి.మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, రావికమతం, రోలుగుంట ప్రాంతాల్లోనూ చింతపండు దిగుబడి అవుతుంది. అయితే 2014లో సంభవించిన హుద్‌హుద్ తుఫానులో మైదాన ప్రాంతంలోని చింత చెట్లు అధిక శాతం కూలిపోయాయి. అలాగే ఏజెన్సీలో సైతం చాలా వరకు చెట్లు నాశనమయ్యాయి. దీంతో ఆ తర్వాత నుంచి చింతపండుకు ఊహించని డిమాండ్ ఏర్పడింది. 2014 వరకు కిలో రూ.15 మాత్రమే ఉన్న చింతపండు 2015లో కిలో రూ.25 అయింది. 2016 నుంచి రూ.50, రూ.60కు తగ్గలేదు. అలాగే గతేడాది సైతం రూ.60 నుంచి రూ.80 వరకు ధర ఉండేది. ఈ ఏడాది ఏజెన్సీలో దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు మైదాన ప్రాంతంలో చింతచెట్లు తగ్గిపోవడంతో చింతపండుకు మరింత డిమాండ్ పెరిగింది. దీంతో సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.100 ధర ఉన్నా, చింతపండు లభించిన పరిస్థితి నెలకొంది.
చింతపండు ధరను స్థిరంగా ఉంచాలి
గిరిజన రైతులకు, వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా చింతపండు ధరను స్థిరంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి పిక్కతో ఉన్న చింతపండు కిలో రూ.45 మద్దతు ధరగా జీసీసీ ప్రకటించినప్పటికీ, ఏజెన్సీలో వర్తకులు అంతకు రెట్టింపు రూ.100 ధరకు చింతపండును కొనుగోలు చేస్తున్నారు. అలాగే అదే చింతపండును మైదాన ప్రాంతంలో కిలో రూ.150లకు విక్రయిస్తున్నారు. దీని వల్ల చింతపండును సేకరించి విక్రయిస్తున్న గిరి రైతుకు, వాటిని కొనుగోలు చేస్తున్న వినియోగదారుల కంటే దళారులుగా వ్యవహరించే వారికే అధిక ప్రయోజనం చేకూరుతోంది. దీంతో రైతులు, వినియోగదారులు నష్టపోతున్నారు. చింతపండు ధర స్థిరంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దాని ధర చుక్కల్ని అంటుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పలువురు అంటున్నారు.