బాక్సైట్ సర్వేపై రగడ
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:42 AM
అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల కోసం సర్వే చేపట్టడంపై జడ్పీటీసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీకే వీధిలోని జర్రెల పరిసరాల్లో కొందరు వ్యక్తులు చేపట్టిన సర్వేకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం సహకరిస్తోందని ఆరోపిస్తూ జడ్పీ సమావేశంలో సభ్యులు ఆందోళనకు దిగుతూ చైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సమావేశమందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది.
- జడ్పీ సమావేశంలో సభ్యుల బైఠాయింపు
- ప్రభుత్వ అనుమతితోనే బాక్సైట్ కోసం సర్వే
- హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆందోళన
- బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జడ్పీ తీర్మానం
- బాక్సైట్ కోసం సర్వేలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు: జేసీ శ్రీపూజిత
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల కోసం సర్వే చేపట్టడంపై జడ్పీటీసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జీకే వీధిలోని జర్రెల పరిసరాల్లో కొందరు వ్యక్తులు చేపట్టిన సర్వేకు ప్రభుత్వం, అధికార యంత్రాంగం సహకరిస్తోందని ఆరోపిస్తూ జడ్పీ సమావేశంలో సభ్యులు ఆందోళనకు దిగుతూ చైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన శనివారం సమావేశమందిరంలో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ సుభద్ర సమావేశాన్ని ప్రారంభిస్తూ ప్రధానమైన పది శాఖలపై చర్చ ఉంటుందని ప్రకటించి తొలుత వ్యవసాయశాఖాధికారులను ఆహ్వానించారు. ఈ దశలో అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు డి. గంగరాజు జోక్యం చేసుకుని ఏజెన్సీలో బాక్సైట్, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సర్వేలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బాక్సైట్, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేయడంతో చింతపల్లి, పెదబయలు జడ్పీటీసీ సభ్యులు పోతుల బాలయ్య, బొంజిబాబులు లేచి గంగరాజుకు సంఘీభావం తెలిపారు. వెంటనే ముగ్గురు కలిసి చైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించారు. వారికి జడ్పీటీసీ సభ్యులంతా మద్దతుగా వచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి సర్వేలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ దశలో చైర్‌పర్సన్ సుభద్ర జోక్యం చేసుకుని పాడేరు ఎమ్మెల్యేతో కలిసి పాడేరు ఐటీడీఎ పీవోను కలిసినప్పుడు బాక్సైట్ తవ్వకాల సర్వేకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారని, అయితే కలెక్టర్ అనుమతితోనే సర్వే చేస్తున్నామని సంబంధిత వ్యక్తులు చెబుతున్నారని, ఈ వ్యవహారంలో మొత్తంగా అనుమానంగా ఉందన్నారు. అనుమతి లేకుండా జర్రెల పరిసరాల్లో మట్టి నమూనాలు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ స్పందిస్తూ బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి జీవోలు విడుదల చేయలేదని, సర్వేలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పేరుతో ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. గత నాలుగేళ్లగా ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదన్నారు. ఎటువంటి సర్వేలు చేయడానికి వీలులేదని, ఈ మేరకు ఎస్పీకి సూచనలు చేశామన్నారు. ప్రస్తుతం ఎస్పీ విచారణ చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన జీఎస్‌ఐ కూడా సర్వే చేయరాదని సదరు అధికారులకు చెప్పామన్నారు. ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండేందుకు ఇక నుంచి ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి సర్వేలు చేసినా జిల్లా యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పాదయాత్ర చేసిందని, 2016లో తవ్వకాల కోసం ఇచ్చిన జీవోలను చంద్రబాబునాయుడు రద్దు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఎటువంటి జీవోలు ఇవ్వలేదని, ఒకవేళ ఉంటే చూపించాలని పేర్కొంటూ తవ్వకాలకు వ్యతిరేకంగా జడ్పీ సమావేశంలో తీర్మానం చేద్దామన్నారు. అంతేగాని తప్పుగా అర్థం చేసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్నారు. గిరిజన సలహా మండలి సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు చర్చ జరగలేదన్నారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపట్టరాదని జడ్పీ తీర్మానం చేసింది. అనంతరం అనంతగిరిలో హైడ్రో పవర్ ప్రాజెక్టుపై సర్వేలు నిలుపుదల చేయాలని కోరగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం తదితరులు చేసిన ప్రస్తావనకు జేసీ స్పందిస్తూ సర్వేలు చేయాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం ఉండాలని పేర్కొంటూ భూముల రీసర్వే తప్ప ఇతర సర్వేలకు అనుమతి ఉండాలన్నారు. సర్వేలకు అనుమతిలేదని ప్రతి గ్రామం బయట బోర్డులు పెట్టామన్నారు.
డీఎంహెచ్‌వో తీరుపై ఆగ్రహం
వైద్య ఆరోగ్యశాఖపై చర్చ సందర్భంగా జడ్పీటీసీ సభ్యులు గంగరాజు, బొంజిబాబు, బాలయ్య అల్లూరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బదిలీలు, ఇతర సేవల కోసం లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. జూనియర్ వైద్యులకు ఆఫీస్‌లో కీలక పదవులు ఇచ్చారని, వైద్యసేవలు అందించడంలో విఫలమైన నేపథ్యంలో వెంటనే సరండర్ చేయాలని డిమాండ్ చేశారు. సభ్యుల ఆందోళనతో జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర ఏకీభవిస్తూ గతంలోనే సరండర్ చేయాలని తీర్మానం చేశామని గుర్తుచేశారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ డీఎంహెచ్‌వో రాకపోగా డిప్యూటీ డీఎంహెచ్‌వో కూడా సమావేశానికి రాకపోవడం బాధ్యత లేకపోవడమేనని మండిపడ్డారు. సభ్యుల ఆందోళనపై జేసీ తిరుమణి శ్రీపూజ స్పందిస్తూ డీఎంహెచ్‌వోపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డుంబ్రిగుడ మండలంలో వైద్యుల కొరత ఉందని జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ చెప్పగా, వైద్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర అధికారులను ఆదేశించారు. కొయ్యూరు పీహెచ్‌సీలో మలేరియాతో బాధపడే వ్యక్తులకు రక్త పరీక్షలు చేస్తే నెగిటివ్ వస్తోందని, అదే వ్యక్తులు నర్సీపట్నంలో ప్రైవేటు ఆస్పత్రులకు వస్తే పాజిటివ్ వస్తోందని కొయ్యూరు ఎంపీపీ ఎ.రమేష్ ప్రస్తావించగా, దీనిపై లోపం ఎక్కడుందో చూస్తామని సంబంధిత అధికారి తెలిపారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు అసంపూర్తిగా ఉన్న విషయాన్ని జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చే నిధులతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని చెప్పగా, త్వరలో భవనాలు పూర్తికి చర్యలు తీసుకుంటామని సంబంధిత అఽధికారి ఒకరు హామీ ఇచ్చారు.