Share News

ఆర్టీసీ స్పెషల్స్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 01:03 AM

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నది.

ఆర్టీసీ స్పెషల్స్‌

రేపటి నుంచే ప్రారంభం

గ్యారేజీల్లో ఫిట్‌నెస్‌ పరీక్షలు పూర్తి

రాత్రి వేళ కూడా స్పెషల్స్‌

నడిపేందుకు అధికారుల నిర్ణయం

ద్వారకా బస్‌స్టేషన్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నది. ఇందుకోసం రీజియన్‌లోని మధురవాడ, వాల్తేరు, మద్దిలపాలెం, విశాఖపట్నం, గాజువాక, స్టీల్‌ సిటీ, సింహాచలం డిపోల నుంచి మంచి కండిషన్‌లో ఉన్న 450 బస్సులను అధికారులు ఎంపిక చేశారు. వీటిని డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పర్యవేక్షణలో గ్యారేజీ మెకానికల్‌ ఇంజనీర్లు, మాస్టర్‌ ఫోర్‌మెన్‌, మెకానిక్‌లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజన్‌ పనితీరు, ఎలక్ట్రికల్‌, బ్రేక్‌, హైడ్రాలిక్‌ సిస్టమ్‌, టైర్ల సామర్థ్యం తనిఖీ చేశారు. సంబంధిత బస్సుల డ్రెవర్లతో మాట్లాడి లోపాలను సరిచేశారు.

హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, భువనేశ్వర్‌ వంటి దూర ప్రాంతాలకు సంక్రాంతి స్పెషల్స్‌గా గరుడ, గరుడ ప్లస్‌, అమరావతి, డాల్ఫిన్‌ క్రూయిస్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసులను నడపనున్నారు. ఈ సర్వీసులన్నీ ఐదేళ్లలోపు వచ్చినవే కనుక అంతగా సాంకేతిక లోపాలు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీటి సాంకేతిక సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు. జోనల్‌ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, టెక్కలి, మందస, విజయనగరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం వంటి ప్రాంతాలకు సూపర్‌ లగ్జరీ, ఆలా్ట్ర డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆలా్ట్ర పల్లెవెలుగు, పల్లె వెలుగు సర్వీసులను నడిపేందుకు నిర్ణయించారు.

సంక్రాంతి ప్రయాణికుల్లో ‘స్త్రీశక్తి’ పథకం ప్రయాణికులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్త్రీశక్తి పథకం వర్తించే బస్సులు కెపాసిటీకి మించి ప్రయాణికులతో నడవాల్సిన పరిస్థితి ఉంటుందని గుర్తించి, అందుకు తగ్గట్టుగా సిద్ధం చేస్తున్నారు. ఎందుకైనా మంచిదని ప్రతి డిపోలో ఐదు అదనపు సర్వీసులను రెడీ చేశారు. ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రాత్రి వేళ కూడా బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.


18న విశాఖ-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి అనంతరం తిరుగు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం-చర్లపల్లి మధ్య ఒక ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైలు ప్రవేశపెడుతున్నామని వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.పవన్‌కుమార్‌ తెలిపారు. 08513 నంబరు గల రైలు ఈ నెల 18వ తేదీ రాత్రి 11 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు చర్లపల్లి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08514 నంబరు గల రైలు ఈ నెల 19న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Jan 07 , 2026 | 01:03 AM