పరిశుభ్రంగా ఆర్‌టీసీ ప్రాంగణాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 10:32 PM
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్‌టీసీ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశం
ఎకో టూరిజం ప్రాంతాల్లో పర్యావరణాన్ని కాపాడాలని సూచన
పాడేరు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆర్‌టీసీ ప్రాంగణాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఆర్‌టీసీ బస్టాండ్‌ల పరిసరాలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, వాటి నిర్వహణపై ప్రయాణికులు అసంతృప్తి చెందుతున్నారన్నారు. అధికారులు స్పందించి ఆయా పరిసరాలు, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలన్నారు. అలాగే డోర్ టూ డోర్ చెత్త సేకరణపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని, దానిని తగ్గించాలని, అందుకు పంచాయతీరాజ్ శాఖాధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఎకో టూరిజం ప్రాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు టూరిజం, అటవీ, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులు చర్యలు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని కాపాడడంతో పాటు పక్కాగా ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు సమర్పించే వినతులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కలెక్టర్ హెచ్చరించారు. ఆయా వినతులను సంపూర్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీల పరిష్కారం కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రజలకు న్యాయం చేసేలా కృషి చేయాలన్నారు. అలాగే ఒకే సమస్యపై ప్రజలు పదే పదే వినతులు సమర్పించే పరిస్థితులు కల్పించవద్దని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు శ్రీపూజ, స్మరణ్‌రాజ్, శుభం నొక్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, ఉమ్మడి జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.