ఆర్టీసీ ఫుల్ జోష్
ABN , Publish Date - Jan 21 , 2026 | 01:09 AM
ఆర్టీసీ విశాఖ రీజియన్ ఫుల్ జోష్‌లో ఉంది. సంక్రాంతి ప్రయాణికుల కోసం ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకూ నడిపిన 1,264 స్పెషల్స్ ద్వారా మంచి ఆదాయం గడించింది.
సంక్రాంతి స్పెషల్స్ ఆదాయం రూ.2.05కోట్లు
పండుగ సమయంలో 1,264 స్పెషల్స్
దూర ప్రాంతాలకు 369
జోనల్ పరిధిలో 895...
ప్రయాణికులు 1.65 లక్షల మంది
సగటు ఆక్యుపెన్సీ రేషియా 81 శాతం
ద్వారకా బస్‌స్టేషన్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):
ఆర్టీసీ విశాఖ రీజియన్ ఫుల్ జోష్‌లో ఉంది. సంక్రాంతి ప్రయాణికుల కోసం ఈనెల 9 నుంచి 20వ తేదీ వరకూ నడిపిన 1,264 స్పెషల్స్ ద్వారా మంచి ఆదాయం గడించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, కర్నూలు, భీమవరం, రాజోలు, కాకినాడ, రాజమండ్రి వంటి దూర ప్రాంతాలకు 369 బస్సులు, ఇక జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, సోంపేట, ఇచ్ఛాపురం, మందస, పాతపట్నం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం, పార్వతీపురం వంటి ప్రాంతాలకు 895 బస్సులు (ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మొట్రో ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మెట్రో ఏసీ, సూపర్ లగ్జరీ, సూపర్ డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్) ఆపరేట్ చేసింది.
ఉద్యోగ, వ్యాపార, విద్య, ఇతర వ్యవహారాల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారు వారి స్వస్థలాల్లో సంక్రాంతి జరుపుకునేందుకు, పండుగ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణం అయ్యేందుకు వీలుగా రవాణా సౌకర్యాలు కల్పించింది. ఈ క్రమంలో మొత్తం 1.65 లక్షల మందిని ప్రత్యేక సర్వీసుల ద్వారా గమ్యస్థానాలకు చేర్చింది. డిమాండ్ ఉన్న రోజుల్లో రాత్రివేళల్లో కూడా ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేసింది.
ప్రత్యేక సర్వీసులు
దూర ప్రాంతాలైన హైదరాబాద్ 50, విజయవాడ 140, రాజమండ్రి 75, కాకినాడ 54, భీమవరం 13, రాజోలు 4, అమలాపురం 11, కర్నూలు 6, తిరుపతి 12, ఖమ్మం 4, కడప 2 ప్రత్యేక సర్వీసులు నడిపింది. జోనల్ పరిధిలోని శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, మందస, పలాస, సోంపేట, పాతపట్నం ప్రాంతాలకు 520, విజయనగరం, బొబ్బిలి, పాలూరు, పార్వతీపురం రాజాం, చీపురుపల్లి ప్రాంతాలకు 375 ప్రత్యేక బస్సులు నడిపింది.
సగటు ఓఆర్ 81 శాతం
సంక్రాంతి స్పెషల్స్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 81 శాతంగా నమోదయ్యింది. సంక్రాంతి ప్రయాణికులను గమ్యానికి చేర్చేటప్పుడు 100 శాతానికి పైగాను, ఆదే బస్సు వెనుతిరిగినప్పుడు గరిష్ఠంగా 60 శాతం ఓఆర్ నమోదైంది. తిరుగు ప్రయాణికుల రవాణాలోను ఇదే పరిస్థితి. ఫలితంగా సగటు ఆక్యుపెన్సీ రేషియో 81 శాతంగా నమోదైనట్టు విశాఖ రీజనల్ అధికారులు లెక్కలు తేల్చారు.
స్పెషల్స్ ఆదాయం రూ. 2.05 కోట్లు
ఈ నెల 9 నుంచి 20వ తేదీ వరకు నడిపిన సంక్రాంతి స్పెషల్స్ ద్వారా రూ.2.05 కోట్ల ఆదాయం వచ్చింది. నగరంలోని ద్వారకా కాంప్లెక్సు, మద్దిలపాలెం, గాజువాక, స్టీల్‌సిటీ, సింహాచలం బస్ స్టేషన్‌ల నుంచి ప్రత్యేక సర్వీసులను ఆపరేట్ చేయడం వల్ల ప్రయాణికులు తమకు అందుబాటులో ఉన్నచోటకు వెళ్లి అక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని, ఇలా చేయడం వల్ల అధికాదాయం రాబట్టామని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు వెల్లడించారు.
నగదుగా వచ్చింది రూ.82 లక్షలు
సంక్రాంతి స్పెషల్స్ నడపడం వల్ల ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు రూ.2.05 కోట్లు ఆదాయం రాగా, అందులో నగదు రూపంలో రూ.82 లక్షలు వచ్చిందని ఆర్‌ఎం తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణించిన మహిళలకు సంబంధించిన చార్జీలు రూ.1.23 కోట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందని అన్నారు.