ప్రధాని సభకు ఆర్టీసీ బస్సులు
ABN , Publish Date - Aug 01 , 2026 | 01:05 AM
భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి 110 బస్సులను అధికారులు వేరే జిల్లాలకు తరలించారు. దీంతో ఆయా డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులు బాగా తగ్గిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి డిపోలో 85 బస్సులకుగాను 58 బస్సులను విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే పంపించారు. ఇక మిగిలింది 27 బస్సులు మాత్రమే కావడంతో కాంప్లెక్స్‌లో ప్రయాణికులు ఎక్కువసేపు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కాంప్లెక్స్‌లోకి బస్సు వచ్చిందే తడవుగా పొలోమంటూ ఎగబడుతున్నారు.
అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి ఇతర జిల్లాలకు పంపిన అధికారులు
బస్సుల కొరతతో ప్రయాణికుల ఇక్కట్లు
అనకాపల్లి టౌన్/ నర్సీపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి 110 బస్సులను అధికారులు వేరే జిల్లాలకు తరలించారు. దీంతో ఆయా డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులు బాగా తగ్గిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అనకాపల్లి డిపోలో 85 బస్సులకుగాను 58 బస్సులను విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే పంపించారు. ఇక మిగిలింది 27 బస్సులు మాత్రమే కావడంతో కాంప్లెక్స్‌లో ప్రయాణికులు ఎక్కువసేపు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కాంప్లెక్స్‌లోకి బస్సు వచ్చిందే తడవుగా పొలోమంటూ ఎగబడుతున్నారు.
నర్సీపట్నం డిపోలో 92 బస్సులు వుండగా వీటిలో 62 బస్సులను ఇతర జిల్లాలకు పంపారు. మిగిలిన వాటిలో నర్సీపట్నం- విశాఖపట్నం రూట్లో నాన్‌స్టాప్‌గా 17 బస్సులను, ఎల్‌హెచ్‌లుగా మూడు బస్సులను, తోటకూరపాలేనికి ఒకటి తిప్పుతున్నారు. మిగిలిన బస్సులు ఇతర రూట్లకు సర్దుబాటు చేశారు. కృష్ణాదేవిపేట, తుని, చోడవరం, చింతపల్లి వైపు ప్రయాణించే వారు, విద్యార్థులు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. పలువురు ఆటోలను ఆశ్రయించి గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. ఇతర జిల్లాలకు వెళ్లిన బస్సులు శనివారం అర్ధరాత్రికి తిరిగి డిపోలకు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు. దీంతో శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం వుంది.