ఆర్‌ఎస్‌కే ప్రీమియం ఆఫీస్ మాత్రమే
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:58 AM
రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా ప్రతిపాదించిన ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’ (ఆర్‌ఎస్‌కే) కేవలం ప్రీమియం ఆఫీసులు మాత్రమేనని ఆ శాఖ విశాఖ డీఐజీ కె.మన్మథరావు తెలిపారు.
అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ లేదు
ఆర్‌ఎస్‌కేలను ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు
డాక్యుమెంట్ రైటర్ల సమ్మె జరుగుతున్నా కొనసాగుతున్న రిజిస్ట్రేషన్లు
రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ కె.మన్మథరావు
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
రిజిస్ట్రేషన్ల శాఖ కొత్తగా ప్రతిపాదించిన ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’ (ఆర్‌ఎస్‌కే) కేవలం ప్రీమియం ఆఫీసులు మాత్రమేనని ఆ శాఖ విశాఖ డీఐజీ కె.మన్మథరావు తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396 గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 295 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా జిల్లాకు ఒకటి చొప్పున 26 జిల్లాల్లో 26 ఆర్‌ఎస్‌కేలు ఏర్పాటు కానున్నాయన్నారు. దీనిని కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగానే భావించాలని, కాకపోతే అక్కడ ప్రీమియం సేవలు అందుతాయన్నారు. సాధారణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారులకు ఎటువంటి సదుపాయాలు లేవని, కనీసం తాగడానికి మంచినీరు కూడా ఉండదన్నారు. ఈ ఆర్‌ఎస్‌కేలో మాత్రం అన్ని రకాల సదుపాయాలతో పాటు ఏ పనిపై వచ్చారో తెలుసుకొని, అవసరమైన సహాయం అందిస్తారన్నారు. స్టాంపు డ్యూటీ కూడా అక్కడే డిజిటల్‌గానో, ఆన్‌లైన్ ద్వారానో చెల్లించుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆర్‌ఎస్‌కేలోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఎనీ వీర్ కింద ఎక్కడ నచ్చితే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఇకపై కూడా అలాగే చేసుకోవచ్చునన్నారు. ఆర్‌ఎస్‌కేలను ప్రైవేటు ఏజెన్సీలకు ఇస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కేవలం ఫ్రంట్ ఆఫీసు నిర్వహణ మాత్రమే కాంట్రాక్టు ఏజెన్సీ చూసుకుంటుందని, మిగిలిన బ్యాక్ ఆఫీసు వ్యవహారాలు (ఫొటోలు, వేలిముద్రలు, స్కానింగ్ వంటివి) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బందే నిర్వహిస్తారన్నారు. ఈ ప్రీమియం సేవలకు గాను డాక్యుమెంట్‌కు రూ.2 వేలు తీసుకుంటారన్నారు. ఇది అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లాగే పనిచేస్తుందన్నారు. దీనివల్ల డాక్యుమెంట్ రైటర్లకు ఎటువంటి నష్టం ఉండదని, ఇదే విషయం వారి సంఘ నాయకులకు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ అంబేద్కర్ వివరించారన్నారు.
అన్ని కార్యాలయాలు పనిచేస్తున్నాయి
డాక్యుమెంట్ రైటర్లు పెన్‌డౌన్ సమ్మె చేస్తున్నందువల్ల ఎక్కడా రిజిస్ట్రేషన్లు ఆగడం లేదని స్పష్టంచేశారు. పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం కింద ఎవరి డాక్యుమెంట్ వారే తయారుచేసుకునే అవకాశం అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఆ పత్రాలు, ఆధార్ కార్డులు, సాక్షి సంతకం చేసే వారితో కార్యాలయానికి వస్తే డాక్యుమెంట్ రైటర్ అవసరం లేకుండానే ‘మే ఐ హెల్ప్ యు’ డెస్క్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు.
కేజీహెచ్ ఆక్సిజన్ బిల్లులపై విచారణ
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌కు ఆక్సిజన్ సరఫరా బిల్లుల చెల్లింపు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో డీఎంఈ విచారణకు కమిటీని నియమించారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి, విజయనగరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవి మాధవి, జాయింట్ డైరెక్టర్ రత్నాల గణపతి, డీఎంఈ కార్యాలయం నుంచి ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక బయో మెడికల్ ఇంజనీర్‌తో కూడిన కమిటీ విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక అందించాల్సి ఉంటుంది.