వర్తనాపల్లి శివాలయానికి రూ.55 లక్షలు
ABN , Publish Date - May 07 , 2026 | 12:11 AM
పాడేరు మండలం వర్తనాపల్లి గ్రామంలో గల శివాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ.55 లక్షలు మంజూరుచేసింది.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో నిధులు మంజూరుచేసిన టీటీడీ
పాడేరు, మే 6 (ఆంధ్రజ్యోతి): పాడేరు మండలం వర్తనాపల్లి గ్రామంలో గల శివాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ.55 లక్షలు మంజూరుచేసింది. ఈ ఏడాది మార్చి 14న పాడేరు మండలం నందిగరువు పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తిరుగు ప్రయాణంలో వర్తనాపల్లిలోని శివాలయాన్ని దర్శించుకున్నారు. అదిచాలా ఏళ్ల కిత్రం నిర్మించినది కావడంతో జీర్ణావస్థకు చేరి ఉంది. ఆ విషయం గుర్తించిన ఆయన శివాలయం అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. దీంతో టీటీడీ నుంచి వర్తనాపల్లిలోని శివాలయం అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరయ్యాయి. ఆ నిధులతో ఆలయాన్ని పునర్నిర్మించడంతో అవసరమైన మరిన్ని విగ్రహాలు, భక్తులు సేదతీరేందుకు మండపం, తాగునీటి సదుపాయం, మైక్ సెట్ తదితరాలు సమకూర్చుతారు. వర్తనాపల్లి శివాలయానికి రూ.55 లక్షలు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు, సభ్యులకు, అధికారులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంత శివాలయం అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయించిన డిప్యూటీ సీఎంకు వర్తనాపల్లి వాసులు కృతజ్ఞతలు తెలిపారు.