జిల్లాకు రూ.2 కోట్లు విడుదల
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:09 PM
బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏర్పడిన వరదలకు జరిగిన నష్టాలను పూడ్చేందుకు అత్యవసర ఖర్చులకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
వరదల అత్యవసర ఖర్చుల నిమిత్తం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
నష్టాల అంచనా ప్రక్రియలో అధికారుల జాప్యం
పాడేరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడి తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల ఏర్పడిన వరదలకు జరిగిన నష్టాలను పూడ్చేందుకు అత్యవసర ఖర్చులకు గాను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు, వంతెనలు, కల్వర్టులు అధికంగా దెబ్బతిన్నాయి. అలాగే పలు చోట్ల ప్రజలకు సంబంధించిన ఇళ్లు కూలిపోగా, మరికొన్ని చోట్ల పంటలు నాశనమయ్యాయి. దీంతో ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి, నష్టాలను భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. అయితే జిల్లాలో వరదల కారణంగా జరిగిన నష్టాలను అంచనా వేసే ప్రక్రియలో వివిధ శాఖల అధికారులు ఆలసత్వంగా ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో వరదల నష్టాలు రెండు రోజుల క్రితమే ప్రకటించగా, అల్లూరి జిల్లాలో పరిస్థితి అందుకు భిన్నంగా జిల్లాలో వరద నష్టాలపై అధికారులు కనీసం సమాచారం ఇవ్వని పరిస్థితి నెలకొంది. వరదలు తగ్గిన తరువాత శనివారం మధ్యాహ్నం నుంచే పలు శాఖలకు చెందిన అధికారులు తమ ప్రాంతాలకు వెళ్లిపోగా, సాయంత్రానికి అందరూ వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో వరద నష్టాలపై శనివారం నాటికి కనీసం సమాచారం అందించే పరిస్థితి లేకుండాపోయింది. అయితే పలు శాఖలకు చెందిన అధికారులు ఇంకా నష్టాలను అంచనా వేయకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని స్పష్టమవుతున్నది.