మోదకొండమ్మ ఉత్సవాలకు రూ.2 కోట్లు
ABN , Publish Date - May 14 , 2026 | 11:36 PM
పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ప్రభుత్వానికి జిల్లా అధికారుల ప్రతిపాదనలు
2016 నుంచి రాష్ట్ర స్థాయి గిరిజన పండుగగా గుర్తింపు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు మోదకొండమ్మ ఉత్సవాలకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో జరిగే మోదకొండమ్మ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఉత్సవ కమిటీ భక్తుల నుంచి విరాళాలు సమకూర్చుకుని పండుగను నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈక్రమంలో ప్రభుత్వం సైతం తమ వంతు సాయంగా నిధులు విడుదల చేయడంతో ఉత్సవాలకు మరింత ప్రోత్సాహంగా ఉండేది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అటువంటి సంప్రదాయం కొనసాగకపోవడంతోపాటు గతేడాది ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు విడుదల కాలేదు. అయితే ఈఏడాది ఉత్సవాలకు ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయాలని ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కమిటీ సభ్యులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. దీంతో మోదకొండమ్మ ఉత్సవాలకు రూ.2 కోట్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు.
2016లో రాష్ట్ర గిరిజన ఉత్సవాలుగా గుర్తింపు
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యేవి. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో పెద్ద గిరిజన ఉత్సవాలుగా మోదకొండమ్మ పండుగ జరుగుతున్న విషయాన్ని గుర్తించిన గత తెలుగుదేశం ప్రభుత్వం, 2016లో రాష్ట్ర స్థాయి గిరిజన ఉత్సవాలుగా మోదకొండమ్మ పండుగను గుర్తించింది. దీంతో ఉత్సవాలకు ప్రత్యేకంగా రూ.కోటి నిధులు విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి ప్రభుత్వపరంగా ఈ ఉత్సవాలకు నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. అలాగే ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ, ఆలయ కమిటీల సమన్వయంతో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.