కాంట్రాక్టు కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:17 PM
సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో విద్యుదాఘాతంతో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు గంగిరి గణేశ్ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు జెన్‌కో అధికారులు అంగీకరించారు.
ఇంట్లో ఒకరికి ఉద్యోగం, తల్లికి పింఛన్
పోస్టుమార్టం జాప్యంపై కుటుంబ సభ్యులు
జెన్‌కో కార్యాలయం వద్ద బైటాయింపు
సీలేరు, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): సీలేరు జలవిద్యుత్ కేంద్రం ఓడీ యార్డులో విద్యుదాఘాతంతో మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు గంగిరి గణేశ్ కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం ఇచ్చేందుకు జెన్‌కో అధికారులు అంగీకరించారు. శుక్రవారం సీఐటీయూ, సీపీఎం, స్థానిక కూటమి నాయకులు కలిసి స్థానిక జెన్‌కో అధికారులతో సమావేశమయ్యారు. అన్‌స్కిల్డ్ లేబర్‌ను ఓడి యార్డులో 220 కేవీ లైన్‌పై ఎలా పనిచేయించారని వారంతా అధికారులను ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికులకు ఇన్సూరెన్స్ ఎందుకు చేయించలేదని నిలదీశారు. దీనికి జెన్‌కో అధికారులు బాధ్యత వహించాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తల్లికి పింఛన్ ఇప్పించాలని జెన్‌కో అధికారులను డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జలవిద్యుత్ కేంద్రంలో పనిచేసే ప్రతీ కాంట్రాక్టు కార్మికులకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. ఈ మేరకు జెన్‌కో అధికారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్మిక, కూటమి నాయకులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం, అంత్యక్రియలకు రూ.50 వేలు, ఇంట్లో ఒకరికి కాంట్రాక్టు లేబర్ ఉద్యోగం ఇవ్వడానికి జెన్‌కో అధికారులు అంగీకరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఎటువంటి సేఫ్టీ చర్యలు తీసుకోకుండా పనులు చేయించిన సంబంధిత జెన్‌కో ఉద్యోగులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూసీ నాయకులు జెన్‌కో అధికారులను డిమాండ్ చేశారు. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా విధుల్లో ఉన్న ఉద్యోగులు, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని జెన్‌కో అధికారులు హామీ ఇచ్చారు. ఈ చర్చల్లో జెన్‌కో తరుపున ఎస్‌ఈలు చిన్నకామేశ్వరరావు, సీహెచ్ హనుమ, ఈఈలు బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం, సీఐటీయూ తరుపున జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్, రాష్ట్ర సభ్యుడు చింతా రాంబాబు, సీలేరు బ్రాంచి గౌరవ అధ్యక్షుడు ఎస్‌కే సుభాన్, అధ్యక్షుడు బి. లక్ష్మణ్, కార్యదర్శి విష్ణుకుమార్‌రాజు, కూటమి నాయకులు సీహెచ్ రాము, రమణ, గోవింద్, డీసీసీ కార్యదర్శి కారే శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోస్టుమార్టం జాప్యంపై కుటుంబ సభ్యుల నిరసన
తమ కుమారుడు గంగిరి గణేశ్ మృతి చెంది 24 గంటలు పైగా కావస్తున్నా పోస్టుమార్టం నిర్వహించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ శుక్రవారం మధ్యాహ్నం మృతుడు కుటుంబ సభ్యులు జెన్‌కో డీఈ కార్యాలయం ముందు బైఠాయించారు. కనీసం మృతదేహాన్ని కడసారిగా విలపిద్దామన్నా అధికారుల నిర్లక్ష్యంతోనే పోస్టుమార్టం జాప్యం జరుగుతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చర్చలు పూర్తయిన తర్వాత శుక్రవారం సాయంత్రం మృతదేహానికి పోస్టుమార్టం చేసి అక్కడ ఉన్న వారి బంధువులకు అప్పగించడంతో జెన్‌కో అంబులెన్స్‌లో మృతదేహాన్ని సీలేరు తరలించారు.