Share News

పరిశ్రమలకు రాచమార్గాలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:51 AM

మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుతోపాటు ప్రైవేటు రంగంలో పలు చిన్న, మధ్య తరహా పరిశ్రలు ఏర్పాటు కానుండడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయం కోసం ప్రభుత్వం కొత్తగా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే రామన్నపాలెం సెంటర్‌ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లి వద్ద జాతీయ రహదారిని కలిపేలా సుమారు 15 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది.

పరిశ్రమలకు రాచమార్గాలు
చినరాచపల్లిలో సర్వే చేస్తున్న సిబ్బంది

మావరపాలెం మండలంలో కొత్తగా మూడు రహదారుల నిర్మాణం

ఒక్కొక్కటి 100 అడుగుల వెడల్పు

రామన్నపాలెం సెంటర్‌- పెదపల్లి 15 కిలోమీటర్లు

ఇప్పటికే రూ.15 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

పైడిపాల- శెట్టిపాలెం రోడ్డు 8 కి.మీ.

చినరాచపల్లి- భీమబోయినపాలెం 2 కి.మీ.

భూ సేకరణకు జోరుగా సర్వే

మాకవరపాలెం, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కుతోపాటు ప్రైవేటు రంగంలో పలు చిన్న, మధ్య తరహా పరిశ్రలు ఏర్పాటు కానుండడంతో ఆయా ప్రాంతాలకు రవాణా సదుపాయం కోసం ప్రభుత్వం కొత్తగా రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే రామన్నపాలెం సెంటర్‌ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లి వద్ద జాతీయ రహదారిని కలిపేలా సుమారు 15 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. తాజాగా పైడిపాల నుంచి మాకవరపాలెం, శెట్టిపాలెం మీదుగా కాఫీ పొడి తయారీ కేంద్రం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర వంద అడుగుల వెడల్పున, చినరాచపల్లి నుంచి భీమబోయినపాలెం మెయిన్‌ రోడ్డు వరకు 100 అడుగుల వెడల్పున రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలను రూపొందించారు.

నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం మండలాన్ని పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేయాలని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు విశేషంగా కృషిచేస్తున్నారు. ఇప్పటికే రాచపల్లి ప్రాంతంలో భారీ అల్యూమినియం కంపెనీ (పయనీర్‌) ఏర్పాటైంది. దీనికి చుట్టుపక్కల మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. రాచపల్లి రెవెన్యూ పరిధిలోని 737 సర్వే నంబరులో 406 ఎకరాల కొండపోరంబోకు భూమిని పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇవి ప్రభుత్వ భూములు అయినప్పటికీ అనాదిగా సాగుచేసుకుంటున్న రైతులకు ఇటీవల సుమారు రూ.40 కోట్లను పరిహారంగా అందించింది. ఇందులో 150 ఎకరాలను ప్రముఖ ఎర్త్‌ మూవర్స్‌ కంపెనీ డోజ్కోకు కేటాయించారు. ఇక్కడ కంపెనీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సంబంధిత యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నది. టైర్ల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం సియట్‌ కంపెనీ 200 ఎకరాలు కావాలని అడిగింది. మిగిలిన 56 ఎకరాలతోపాటు మరో 100 ఎకరాలను సేకరించి పుడ్‌ప్రాసెసింగ్‌ కంపెనీ ఏర్పాటు కోసం సన్నాహాలు ప్రారంభించారు. ఇందులోనే ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆయా కంపెనీలకు రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారిని అనుసంధానించేలా రహదారులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రామన్నపాలెం సెంటర్‌ నుంచి ఎరకన్నపాలెం మీదుగా ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లి వద్ద జాతీయ రహదారిని కలిపేలా సుమారు 15 కిలో మీటర్ల పొడవున, 100 అడుగుల వెడల్పుతో రహదారి (వాక రోడ్డు) నిర్మాణం కోసం గతంలోనే అధికారులు సర్వే చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిచారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రూ.15 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియలో వుంది.

ఇదిలాఉండగా చినరాచపల్లి నుంచి భీమబోయినపాలెం మెయిన్‌ రోడ్డును కలుపుతూ 100 అడుగుల రోడ్డు నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. ఇది ఎరకన్నపాలెం వద్ద రామన్నపాలెం సెంటర్‌- పెదపల్లి రహదారికి కలుస్తుంది. మరోవైపు ల్యాండ్‌ బ్యాంకుగా ప్రకటించిన 4,250 ఎకరాలకు రవాణా సదుపాయం కోసం పైడిపాల నుంచి మాకవరపాలెం, తామరం, గండిపేట, భీమబోయినపాలెం, శెట్టిపాలెం మీదుగా కాఫీ పొడి తయారీ కేంద్రం వరకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల పొడవున, 100 అడుగుల వెడల్పున రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు మ్యాపును తయారుచేశారు. ఇది దుంగలవానిపాలెం, చినరాచపల్లితోపాటు పరిశ్రమల కోసం కేటాయించిన 406 ఎకరాల మీదుగా వాకరోడ్డుకు కలుస్తుంది. ఏపీఐఐసీ ఎండీ దినేశ్‌కుమార్‌ ఇటీవల ఈ భూములను పరిశీలించి వెళ్లారు. ఈ తరువాతే కొత్తగా రెండు రహదారుల నిర్మాణానికి అధికారులు ప్లాన్‌ తయారు చేశారు. ఆయా రహదారుల నిర్మాణానికి భూమిని, పరిశ్రమల కోసం మరో 100 ఎకరాలను సేకరించేందుకు అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.

Updated Date - Jun 08 , 2026 | 12:51 AM