Share News

గ్రామాలకు రాచబాట

ABN , Publish Date - Mar 29 , 2026 | 01:08 AM

జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2025-26 సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.110 కోట్ల వ్యయంతో మొత్తం 1,611 సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి.

గ్రామాలకు రాచబాట
కె.కోటపాడు మండలం దాలివలసలో నిర్మాణంలో ఉన్న సిమెంట్‌ రోడ్డు

- జిల్లాలో శరవేగంగా రహదారుల నిర్మాణ పనులు

- రూ.110 కోట్లతో 1,611 సీసీ రోడ్లు

- ఇప్పటికే సగానికి పైగా పూర్తి

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2025-26 సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో జిల్లాలో రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.110 కోట్ల వ్యయంతో మొత్తం 1,611 సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి.

గత ఏడాది జూన్‌, జూలై నెలల్లో ప్రారంభమైన సీసీ రోడ్ల నిర్మాణాల్లో ఇప్పటికే 901 పూర్తి కాగా, మిగిలిన 710 నిర్మాణాలు వివిఽధ దశల్లో కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయి. అనకాపల్లి మండలంలో మారేడుపూడి, అక్కిరెడ్డిపాలెం, గోపాలపురం, శంకరం, గొలగాం, రేబాక గ్రామాల్లో రహదారుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గొలుగొండ మండలంలో రూ.3 కోట్లతో పనులు చేపట్టగా, ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. మునగపాక మండలంలో రూ.5.1 కోట్లతో సీసీ రోడ్లను నిర్మిస్తున్నారు. మొత్తం 51 పనులకు గాను 42 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మాకవరపాలెం మండలంలో రూ.5 కోట్లతో చేపడుతున్న సీసీ రోడ్లలో 42 నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. రాంబిల్లి మండలంలో రూ.3.28 కోట్లతో జరుగుతున్న సీసీ రోడ్ల పనుల్లో సగానికిపైగా పూర్తయ్యాయి. బుచ్చెయ్యపేట మండలంలో రూ.7 కోట్లతో 108 పనులు చేపట్టగా, 4 రోడ్లు వివిధ కారణాలతో ప్రారంభం కాలేదు. మిగిలినవన్నీ చివరి దశలో ఉన్నాయి. పాయకరావుపేట మండలంలో రూ.2.24 కోట్లతో 47 సీసీ రోడ్లను నిర్మిస్తుండగా, ఇందులో సగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలినవి ఒకటి, రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. గ్రామాలను అనుసంధానం చేస్తూ సీసీ రోడ్లను నిర్మిస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటోంది. పలు గ్రామాలకు దూరంగా ఉండే ఆలయాలు, శ్మశానవాటికలకు కూడా సీసీ రోడ్లను వేస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న సీసీ రోడ్ల పనులకు సంబంధించిన బిల్లులన్నీ ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తున్నామని, మార్చి నెలాఖరు తరువాత పనులు చేసిన కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లింపులు జరుగుతాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ పూర్ణిమాదేవి తెలిపారు.

Updated Date - Mar 29 , 2026 | 01:08 AM