Share News

మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు

ABN , Publish Date - May 13 , 2026 | 01:05 AM

నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలకుచేరాయి.

మూలకు చేరిన ఆర్వో ప్లాంట్లు

ఒక్కో పాఠశాలకు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలతో కొనుగోలు

నిర్వహణకు నిధుల లేమి, అవగాహనా లోపం

విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):

నాడు-నేడు పథకంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలకుచేరాయి. విద్యార్థుల సంఖ్య మేరకు ఒక్కో పాఠశాలకు రూ.3 లక్షల నుంచి రూ.6లక్షలు వెచ్చించి ఆర్వో ప్లాంట్లు కొనుగోలుచేశారు. ప్లాంట్లు ఏర్పాటు తరువాత రీఫిల్స్‌, మెంబరెన్స్‌ (పరికరాలు) మార్చాలి. తగిన నిధులు లేక ఇవి మూలకుచేరాయి. వీటి నిర్వహణపై అవగాహన లేకపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు నాడు-నేడు పథకం కింద కొత్తగా భవనాలు, ఫర్నిచర్‌, స్మార్ట్‌బోర్డులు, లేబొరేటరీలు, ఆర్వోప్లాంట్లు, పాఠశాలకు పెయింటింగ్‌కు నిధులు విడుదల చేశారు. జిల్లాలో 568 ప్రభుత్వ ప్రాథమిక, యూపీ, ఉన్నత పాఠశాలలను రెండు దశల్లో నిధులిచ్చారు. చాలావరకు ఐటెమ్స్‌ సెంట్రల్‌ పర్చేజింగ్‌ కమిటీ ద్వారా (రాజధాని స్థాయిలో) కొనుగోలుచేశారు. పాలకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై కమిషన్లకు కక్కుర్తిపడ్డారు. దీనిలో భాగంగా విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడానికి ఆర్వో ప్లాంట్లు కొనుగోలుచేసి పాఠశాలల్లో ఏర్పాటుచేశారు. కొన్ని ప్లాంట్లు నాసిరకంగా ఉన్నాయని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇవి పనిచేయాలంటే పాఠశాలల్లో నీటి ట్యాంకు, దాని నుంచి అన్నిచోట్లకు పైపుల ద్వారా సరఫరా సదుపాయం ఉండాలి. విద్యుత్‌తోపాటు ఆర్వో ప్లాంట్‌ నిర్వహణ సమయంలో వచ్చే వృథా నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేయాలి. చాలాచోట్ల ఈ వ్యవస్థలు ఏర్పాటుచేయగా, కొన్నిచోట్ల లేకపోవడంతో ప్లాంట్లు ఇప్పటికీ అమర్చలేదు. దీనిపై ప్రశ్నిస్తే ఇంజనీరింగ్‌ అధికారులు మౌనం వహిస్తున్నారు.

ఆర్వో ప్లాంట్‌ నిరంతరం పనిచేయాలంటే విద్యుత్‌ సరఫరా అవసరం. ప్రతి ఎనిమిది నుంచి 10 నెలల మధ్యన రీఫిల్స్‌, మెంబరెన్స్‌లు మార్చాల్సిందే. ఇందుకు కనీసం రూ.8 వేల వరకు ఖర్చవుతుంది. నెలకు 100 యూనిట్ల నుంచి 150 యూనిట్ల వరకు విద్యుత్‌ అవసరం. ఈ ఖర్చు సంబంధిత పాఠశాల నిధుల నుంచి భరించాలి. అయితే 90 శాతం పాఠశాలల్లో నిధుల సమస్య ఉంది. ఈ నేపథ్యంలో పనిచేసినంతకాలం ఆర్వోప్లాంట్లను వినియోగించారు. నిర్వహణను పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. ప్లాంట్ల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారుల దృష్ఠికి తీసుకెళ్లలేదని చెబుతున్నారు. ప్లాంట్ల నిర్వహణకు ఖర్చు ఎక్కువ అవుతుందని గత పాలకులు, ఉన్నతాధికారులు ఆలోచించలేదు. కేవలం కమిషన్ల కక్కుర్తితో అప్పట్లో ఆర్వో ప్లాంట్లు కొనుగోలుచేశారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం పాఠశాల గోడలకు దిష్టిబొమ్మల్లా ఇవి దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నందున ఆర్వోప్లాంట్లు వినియోగంలోనికి తీసుకురావాల్సి ఉంది. కాగా జిల్లాలో ప్లాంట్ల నిర్వహణ, ఇతర అంశాలను పాఠశాలల వారీగా సేకరిస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమకుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదించి, ప్లాంట్లు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.


అనుబంధంపై సందేహం?

ఏయూ అనుబంధ కాలేజీల ర్యాటిఫికేషన్‌ పక్కాగా జరిగేనా

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో 304 డిగ్రీ, బీఈడీ, పీజీ, లా, ఇతర కాలేజీలు

వీటిలోని అనేక కాలేజీల్లో కనీస మౌలిక వసతులు, సదుపాయాలు కొరత

కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అందుబాటులోని లేని ఫ్యాకల్టీ

కాలేజీలు తనిఖీలకు కమిటీలు వేయాలని వైస్‌ చాన్సలర్‌కు ఫైల్‌ పెట్టిన సీడీసీ

పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే అడ్డగోలు కాలేజీలకు చెక్‌ చెప్పేందుకు అవకాశం

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

అనుబంధ కళాశాలలకు ధ్రువీకరణ/గుర్తింపు (ర్యాటిఫికేషన్‌) ప్రక్రియను ఆంధ్ర విశ్వవిద్యాలయం మరింత పకడ్బందీగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అనేక కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఉండడం లేదు. అయినప్పటికీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. ఈ ఏడాదైనా పక్కాగా తనిఖీలు జరిగేలా వైస్‌చాన్సలర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో 304 డిగ్రీ, పీజీ, బీఈడీ, లా, ఇంజనీరింగ్‌ (ఏడు) కళాశాలలు ఉన్నాయి. ఏయూ అనుబంధ కాలేజీలుగా గుర్తింపు ఇవ్వాలంటే వర్సిటీకి చెందిన అధికారుల బృందం వాటిని సందర్శించాలి. కాలేజీ భవనాలు, వాటి స్థితిగతులు, విద్యార్థులకు సంబం ధించిన మౌలిక వసతులు కల్పన, సిబ్బంది సంఖ్య, వారి అర్హతలు, మైదానం వంటి అంశాలను పరిశీలించాలి. కాలేజీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, వసతులు ఉంటేనే ధ్రువీకరణ ఇవ్వాలి. ఒకవేళ ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు సదరు కాలేజీలకు అవకాశం ఇవ్వొచ్చు. గడువులోగా ఆయా లోపాలను సరిచేసుకోకుంటే ఆయా కాలేజీలను ర్యాటిఫై చేయాల్సిన అవసరం ఉండదు.

చూసీ చూడనట్టు వ్యవహరిస్తారా?

ఏయూ పరిధిలో ర్యాటిఫికేషన్‌ ప్రక్రియ తూతూమంత్రంగా సాగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం వర్సిటీ అధికారులు ఒక్కో కాలేజీకి ఇద్దరు చొప్పున సీనియర్‌ ప్రొఫెసర్లను పంపిస్తారు. అయితే, ఈ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అనేకచోట్ల సరైన సౌకర్యాలు లేకుండానే కాలేజీలు నిర్వహిస్తున్నారు. బీఈడీ, బీపీఈడీ, లా వంటి కోర్సులు నిర్వహించే కళాశాలల్లో మౌలిక సదుపాయాలు ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నగరంతో పాటు విజయనగరం జిల్లాలో అనేకచోట్ల ఈ తరహా కాలేజీలు ఉన్నా ఏయూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వచ్చే ఏడాది ‘గుర్తింపు’నకు సంబంధించి కాలేజీల తనిఖీకి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌కు కాలేజీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) ఫైల్‌ పెట్టింది. కాలేజీల తనిఖీలకు కమిటీలు వేయాలని కోరింది.

Updated Date - May 13 , 2026 | 01:05 AM