Share News

ఎన్నికలు బహిష్కరించిన రొంగలివానిపాలెం

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:14 AM

అనకాపల్లి మండలం రొంగలవానిపాలెం పంచాయతీ ఓటర్లు మూకుమ్మడిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. మొత్తం 821 మంది ఓటర్లు ఉండగా...ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇందుకు సంబంధించి గ్రామస్థులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. రొంగలివానిపాలెం పంచాయతీ సర్పంచ్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారులు అక్టోబరు 16వ తేదీన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ సర్పంచ్‌ పదవిని ఎస్సీలకు కేటాయిస్తూ అక్టోబరు 31న మరోసారి గెజిట్‌ విడుదల చేశారు.

ఎన్నికలు బహిష్కరించిన రొంగలివానిపాలెం
రొంగలివానిపాలెం ఓటర్లు ఎన్నికలను బహిష్కరించడంతో ఖాళీగా ఉన్న పోలింగ్‌ కేంద్రం, ఎన్నికల సిబ్బంది

సర్పంచ్‌ పదవి రిజర్వేషన్‌పై అధికారుల తీరుకు నిరసన

తొలుత బీసీ మహిళకు కేటాయింపు

పక్షం రోజుల తరువాత ఎస్సీలకు రిజర్వు

పంచాయతీలో ఏడుగురు మాత్రమే ఆ కేటగిరీ ఓటర్లు ఉన్నట్టు వెల్లడి

అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవడంతో పోలింగ్‌ బహిష్కరణ

కొత్తూరు (అనకాపల్లి జిల్లా), నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి మండలం రొంగలవానిపాలెం పంచాయతీ ఓటర్లు మూకుమ్మడిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించారు. మొత్తం 821 మంది ఓటర్లు ఉండగా...ఒక్కరు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఇందుకు సంబంధించి గ్రామస్థులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి. రొంగలివానిపాలెం పంచాయతీ సర్పంచ్‌ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారులు అక్టోబరు 16వ తేదీన గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ సర్పంచ్‌ పదవిని ఎస్సీలకు కేటాయిస్తూ అక్టోబరు 31న మరోసారి గెజిట్‌ విడుదల చేశారు. దీంతో అధికారుల తీరుపై గ్రామస్థులు విస్మయం వ్యక్తంచేశారు. తమ పంచాయతీలో మొత్తం ఏడుగురు మాత్రమే ఎస్సీ ఓటర్లు ఉన్నారని, అత్యధిక శాతం మంది బీసీ ఓటర్లని చెబుతున్నారు. సర్పంచ్‌ రిజర్వేషన్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని, ముందుగా ప్రకటించినట్టు బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందించారు. కానీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని బుధవారం రాత్రి నిర్ణయం తీసుకుని, ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు తెలియపరిచారు. చెప్పినట్టుగానే గురువారం రొంగలివానిపాలెం పంచాయతీ ఓటర్లందరూ పోలింగ్‌ను బహిష్కరించారు. రొంగలివానిపాలెం పంచాయతీ కుంచంగి ఎంపీటీసీ స్థానం పరిధిలో ఉంది. ఎంపీటీసీ స్థానంలో మూడు పోలింగ్‌ కేంద్రాలకుగాను ఒకటి రొంగలివానిపాలెం ఉంది. మొత్తం 821 మంది ఓటర్లు వున్నారు. ఒక్కరు కూడా పోలింగ్‌ కేంద్రానికి రాలేదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు.

కాగా రొంగలివానిపాలెం పంచాయతీ ఓటర్లు ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలుసుకున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ, డిప్యూటీ సీఈవో రాజ్‌కుమార్‌, అనకాపల్లి ఆర్డీవో శ్రీనివాస్‌, డీపీవో కిరణ్‌, రూరల్‌ సీఐ జి.అశోక్‌కుమార్‌, ఎంపీడీవో ఆశాజ్యోతి, తదితరులు గ్రామానికి వెళ్లి పెద్దలతో, రాజకీయ పార్టీల నేతలతో చర్చించారు. పంచాయతీ సర్పంచ్‌ పదవి రిజర్వేషన్‌ మార్పు విషయంలో అధికారులు తమకు న్యాయం చేయలేదని, అందువల్ల ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనలేమని స్పష్టం చేశారు. దీంతో ఆయా అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని చెప్పి అక్కడి నుంచి తిరుగుముఖం పట్టారు.

Updated Date - Nov 06 , 2026 | 01:14 AM