రాక్‌ట్రీ ఇష్టారాజ్యం
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:50 AM
నగర శివారు ప్రాంతాల్లో గల ఐదు లేఅవుట్‌లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ‘రాక్‌ట్రీ’ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది.
పేదల ఇళ్ల నిర్మాణానికి తక్కువ స్టీలు, సిమెంటు వినియోగం
ఇసుక వినియోగంలో భారీ గోల్‌మాల్
చేసిన పనుల కంటే ఎక్కువగా బిల్లులు
రూ.22.77 కోట్లు రికవరీకి విజిలెన్స్ సిఫారసు
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
నగర శివారు ప్రాంతాల్లో గల ఐదు లేఅవుట్‌లలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన ‘రాక్‌ట్రీ’ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. గత ప్రభుత్వ హయాంలో పాలకుల దన్ను ఉండడంతో చేసిన పని కంటే ఎక్కువ బిల్లులు డ్రా చేసింది. అలాగే ఇనుము, సిమెంట్, ఇసుక వంటివి అదనంగా తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు, మెటీరియల్ డ్రా చేసిన రాక్‌ట్రీ ఏజెన్సీ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఐదు లేఅవుట్‌లలో చేపట్టిన నిర్మాణాలకు, రికార్డుల్లో ఉన్న వివరాలకు తేడా ఉందని గుర్తించి రూ.22.77 కోట్లు రికవరీ చేయాలని నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాక్‌ట్రీ ఏజెన్సీపై క్రిమినల్ కేసు చేయాలని హౌసింగ్ అధికారులకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
గత ప్రభుత్వంలో రాక్‌ట్రీ ఏజెన్సీకి పైడివాడ అగ్రహారం, నంగినారపాడు, గొల్లలపాలెం, గంగవరం, నడుపూరుల్లో 14,627 ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. వీటిలో పైడివాడ అగ్రహారంలో మోడల్‌గా ఒక ఇంటిని మాత్రమే సంస్థ నిర్మించింది. పైడివాడ అగ్రహారంలో 6,412 ఇళ్లకు 6,102, నంగినారపాడులో 1,533కి 1,456, గంగవరంలో 1,718కి 1,691, గొల్లలపాలెంలో 1,563కి 1,563, నడుపూరులో 3,401కి 3,207...మొత్తం 14,627కి 14,021 ఇళ్ల నిర్మాణం ఈ సంస్థ ప్రారంభించింది. ఈ సంస్థ చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందడంతో విశాఖతోపాటు రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2024లోనే తనిఖీలు చేపట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరుచేసిన ఈ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు కూడా కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల మేరకు ఇవ్వాలి. దీనికి భిన్నంగా ప్రతి ఇంటికి రూ.ఐదు వేల నుంచి రూ.20 వేల వరకు అడ్వాన్స్ కింద రాక్‌ట్రీ ఏజెన్సీకి అప్పటి అధికారులు ఇచ్చినట్టు విజిలెన్స్ బృందం గుర్తించింది. ఐదు లేఅవుట్‌లలో మెటీరియల్, సొమ్ములు కలిపి 14,021 ఇళ్లకు రూ.263.28 కోట్లు చెల్లించాలి. అయితే రాక్‌ట్రీ ఏజెన్సీ 2024లో పనులు నిలిపివేసే సమయానికి బిల్లుల కింద రూ.60.12 కోట్లు తీసుకుంది. మొత్తం 4,929 ఇళ్లకు సంబంధించి అసలు కంటే అదనంగా రూ.5.88 కోట్లు ఇచ్చినట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గుర్తించింది. అలాగే ఇనుము, సిమెంట్ చాలా తక్కువ వినియోగించింది. బిల్లులు మాత్రం రూ.5.01 కోట్లు అదనంగా తీసుకుంది. ఆ మొత్తం కూడా రికవరీ చేయాలని విజిలెన్స్ పేర్కొంది. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాల కోసం 16,957 ఇసుక కూపన్లు (అంటే 84,785 టన్నుల ఇసుక) జారీచేయగా వాటిలో 36,412 టన్నులు వినియోగించిన రాక్‌ట్రీ మిగిలిన 48,373 టన్నులకు లెక్కలు చెప్పలేదు. ఇదిలావుండగా ఇళ్ల నిర్మాణాలు జరిగినట్టు ఆన్‌లైన్‌లో నమోదుచేసిన వివరాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పనులు ఉన్నట్టు నిర్ధారించారు. చేసిన పనుల కంటే ఎక్కువగా రూ. 11.87 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం రికవరీ చేయాలని సూచించింది. మొత్తం 14,021 ఇళ్లలో 7,460 ఇళ్లు పునాదుల వరకు, 5,890 ఇళ్లు బేస్‌మెంట్ వరకు, 29 ఇళ్లు గోడల వరకు, 425 ఇళ్లు స్లాబ్ లెవెల్‌కు, 145 ఇళ్లకు స్లాబ్ వేశారు. మొత్తమ్మీద లెక్కించి రూ.22.77 కోట్లు రాక్‌ట్రీ నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో సాధారణంగా చేపట్టే మట్టి నమూనా పరీక్షలను కూడా హౌసింగ్ అధికారులు చేపట్టలేదని విజిలెన్స్ తన నివేదికలో తప్పుబట్టింది.