ఇళ్ల నిర్మాణంలో రాక్‌ట్రీ అక్రమాలు
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:16 AM
పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా వైదొలగిన ‘రాక్‌ట్రీ’ సంస్థపై చర్యలకు హౌసింగ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘
చర్యలకు హౌసింగ్ అధికారుల మీనమేషాలు
ఆ సంస్థ వైసీపీ నాయకుడికి చెందినది కావడంతో గొడవెందుకని వెనకడుగు
లబ్ధిదారులతో ఫిర్యాదు చేయించాలన్న పోలీసులు
విశాఖపట్నం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి):
పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా వైదొలగిన ‘రాక్‌ట్రీ’ సంస్థపై చర్యలకు హౌసింగ్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘రాక్‌ట్రీ’ వైసీపీ నాయకుడికి చెందిన సంస్థ కావడంతో ఎందుకొచ్చిన గొడవని చూసీచూడనట్టు వదిలేశారని తెలిసింది. చివరకు పోలీసులు కూడా పలు రకాల సందేహాలు వ్యక్తం చేస్తూ లబ్ధిదారులతోనే ఫిర్యాదులు ఇప్పించాలని సూచించడం వెనుక ఒత్తిళ్లు ఉన్నాయా?...అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
‘రాక్‌ట్రీ’ సంస్థ నాలుగు లేఅవుట్‌లలో 14,021 ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయలేదు సరికదా బిల్లులు అదనంగా డ్రా చేసుకున్నట్టు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్ధారించింది. రూ.22.77 కోట్లు రికవరీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విజిలెన్స్ నివేదిక మేరకు రాక్‌ట్రీపై కేసులు నమోదు చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆయా లేఅవుట్లు ఉన్న ప్రాంతంలో పోలీసులను సంప్రతించారు. అయితే అధికారులు కాకుండా ఇళ్ల లబ్ధిదారులతో ఫిర్యాదు చేయించాలని పోలీసులు సూచించారు. మరోవైపు హౌసింగ్ ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు తప్ప రాత పూర్వకంగా ఏమీ రాలేదు. ఈ విషయం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. కానీ, దీనిపై ఇంతవరకు ఎటువంటి సమాధానం లేదు. దీంతో హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజిలెన్స్ రిపోర్టు స్పష్టంగా ఉన్నా ఎందుకు వెనుకంజ వేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
లబ్ధిదారులతో ఫిర్యాదు చేయించే విషయంలో అధికారులు చొరవ తీసుకోవడం లేదని ప్రచారం సాగుతుంది. కనీసం పది శాతం ముందుకువచ్చినా కేసులు నమోదు చేయవచ్చు. రాక్‌ట్రీ వైసీపీ నాయకుడిది కావడంతో వారితో వివాదం ఎందుకని కొందరు అధికారులు వెనకడుగు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తద్వారా అక్రమాల వ్యవహారాన్ని నీరుగార్చుతున్నారనే వాదన ఉంది. ఇదిలావుండగా రాక్‌ట్రీపై ఫిర్యాదుకు వెనుకంజ వేస్తున్న లబ్ధిదారులు, తమ ఇళ్లు పూర్తిచేసి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. నాలుగు లేఅవుట్‌లలో నగంలో వదిలేసిన ఇళ్ల నిర్మాణంపై అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉంది.