Share News

ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:53 AM

ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు

ప్రశాంత ఎన్నికలకు పటిష్ఠ చర్యలు
రావికమతంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళీతో మాట్లాడుతున్న ఎస్పీ తుహీన్‌ సిన్హా

జిల్లాలో 16 పెట్రోలింగ్‌ టీంలు, ఎనిమిదిచోట్ల అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు

ఎస్పీ తుహిన్‌ సిన్హా

రావికమతం, బుచ్చెయ్యపేటల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల పరిశీలన

రావికమతం/ బుచ్చెయ్యపేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని ఎస్పీ తుహీన్‌ సిన్హా తెలిపారు. ఆయన గురువారం రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో పర్యటించారు. రావికమతం మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్ల కేంద్రాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన పోలీస్‌ బందోబస్తును పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ విషయంలో ఇబ్బందులు ఏమైనా తలెత్తున్నాయా? అని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మురళిని అడిగారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, అంతా ప్రశాంతంగానే జరుగుతున్నదని ఆయన బదులిచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వుండేందుకు జిల్లా వ్యాప్తంగా 16 పెట్రోలింగ్‌ టీమ్‌లు నియమించామని, ఎనిమిదిచోట్ల అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సమయంలో అల్లర్లకు పాల్పడే అవకాశం వుందన్న అనుమానంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 మందిని ఇప్పటికే బైండోవర్‌ చేసినట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరికొంతమందిని గుర్తించి వారినీ బైండోవర్‌ చేస్తామని స్పష్టం చేశారు.

బుచ్చెయ్యపేటలో నామినేషన్ల దాఖలు కేంద్రాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును ఎస్పీ తుహిన్‌ సిన్హా స్వయంగా పరిశీలించారు. నామినేషన్ల దాఖలు సాఫీగా సాగుతున్నదా? అని ఎన్నికల రిట్నరింగ్‌ అదికారి గోపాలరాజు, సహాయ ఎన్నికల అధికారులు శివప్రసాద్‌ నారాయణరావు, ఎం.లక్ష్మిలను అడిగారు. అనంతరం సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌, పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. నామినేషన్‌ వేయడానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే కార్యాలయంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. నామినేషన్‌ దాఖలు పూర్తయిన వెంటనే అభ్యర్థులు, వారితో వచ్చిన వ్యక్తులు అక్కడి నుంచి సత్వరమే వెళ్లిపోయేలా చూడాల్సిన బాధ్యత పోలీసులేదనని ఎస్పీ చెప్పారు.

Updated Date - Oct 23 , 2026 | 12:53 AM