మెడికల్ షాపుల్లో దోపిడీ
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:00 AM
జన్ ఔషధి దుకాణాల్లో విక్రయించాల్సిన జనరిక్ మందులను.. ఇతర దుకాణాల్లో గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కు విక్రయిస్తున్నారు.
బ్రాండెడ్ మందుల ధరకు జనరిక్ ఔషధాల అమ్మకం
తేడాలను గుర్తించలేకపోతున్న వినియోగదారులు
ధరల్లో 70-90 శాతం మేర వ్యత్యాసం
మరిన్ని జనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేయాలని ప్రజల వినతి
నర్సీపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
జన్ ఔషధి దుకాణాల్లో విక్రయించాల్సిన జనరిక్ మందులను.. ఇతర దుకాణాల్లో గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కు విక్రయిస్తున్నారు. జనరిక్ మందులపై ప్రభుత్వ ముద్ర ఉంటుంది. కానీ ఇతర మెడికల్ షాపుల్లో విక్రయించే మందుల్లో ఏది జనరిక్, ఏది బ్రాండెడ్ అని గుర్తించే అవకాశం లేదు. ఫార్మా కంపెనీలు మెడికల్ షాపులు, డాక్టర్లను దృష్టిలో ఉంచుకొని జనరిక్ మందుల మీద ఎంఆర్‌పీ ముద్రిస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు, కడుపు మంట వంటి రుగ్మతలతో బాధపడుతున్న వారిలో చాలా మంది డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా సమీపంలోని మెడికల్ షాపులకు వెళ్లి మందులు తీసుకొని వాడుతుంటారు. ఇటువంటివారికి జనరిక్ మందులను బ్రాండెడ్ మందుల ధరలకు విక్రయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పుల నివారణకు వాడే పది టాబ్లెట్స్ ఖరీదు జనరిక్‌లో రూ.10 వుండగా, ఇవే మందులను ఇతర మెడికల్ షాపుల్లో రూ.50 లకుపైగా విక్రయిస్తున్నారు.
బ్రాండెడ్‌కు, జనరిక్‌కు తేడా ఏమిటంటే..
ఏదైనా ఒక ఫార్మా కంపెనీ పరిశోధన చేసి, కొత్తగా ఔషఽధాన్ని తయారు చేస్తే సదరు కంపెనీకి 20 సంవత్సరాల వరకు పేటెంట్ హక్కులు ఉంటాయి. మందు తయారు చేయడానికి పరిశోధన, మార్కెటింగ్ కోసం సదరు కంపెనీ కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. పేటెంట్ కాలంలో ఇవే కెమికల్స్, ఫార్ములాను ఉపయోగించి ఇతర కంపెనీలు ఆ మందుని తయారు చేయకూడదు. ఇటువంటి వాటిని బ్రాండెడ్ మందులని అంటారు. కంపెనీ మొట్టమొదటి తయారు చేసిన మందు పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అవే కెమికల్స్ ఉపయోగించి అదే ఫార్ములాతో ఇతర ఫార్మా కంపెనీలు మందులను తయారు చేసుకోవచ్చు. వీటిని జనరిక్ మందులు అంటారు. బ్రాండెడ్ మందులు మాదిరిగానే జనరిక్ మందులు కూడా అంతే నాణ్యత కలిగి ఉంటాయని నర్సీపట్నం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కల్యాణి అన్నారు.
జన్ ఔషధి కేంద్రంలో తక్కువ ధరకు మందులు
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం, జనరిక్ మందులు షాపుల్లో తక్కువ ధరకు మందులు విక్రయిస్తున్నారు. కొన్ని రకాల దీర్ఘకాలిక జబ్బులతోబాధ పడుతున్న రోగులు జీవిత కాలంపాటు మందులు వాడాల్సి ఉంటుంది. బ్రాండెడ్ మందులు వాడాలంటే ప్రతి నెలా వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. జనరిక్ మందులు షాపుల్లో తక్కువ ధరకు నాణ్యమైన మందులు లభ్యమవుతాయి. బీపీ, షుగర్, థైరాయిడ్, మల్టీ విటమిన్, జ్వరం, ఒళ్లు నొప్పులు, యాంటిబయాటిక్స్ మందులు ఇతర మెడికల్ షాపుల్లో కంటే 70 నుంచి 90 తక్కువ ధరకు లభిస్తున్నాయి. ఎసిక్లోఫెనక్, పారాసిటమాల్ కాంబినేషన్ టాబ్లెట్స్ (10) జనరిక్ మెడికల్ షాపులో రూ.10కి లభిస్తుండగా, మెడికల్ షాపులో బ్రాండెడ్ టాబ్లెట్స్ రూ.52 ఉంది. యాంటిబయాటిక్ సిఫిక్సిన్ 10 టాబ్లెట్స్ జనరిక్‌లో రూ.53కు లభిస్తుండగా, బ్రాండెడ్‌లో రూ.110కి విక్రయిస్తున్నారు. చెక్కర వ్యాధికి వాడే గ్లిమెపిడిన్ 2ఎంజీ 10 ట్లాబ్లెట్స్ జనరిక్‌లో రూ.5.5 ధర ఉంటే, బ్రాండెడ్‌లో రూ.62 ఉంది. ఈ విధంగా అన్ని రకాల మందులు బ్రాండెడ్ కంటే జనరిక్‌లో తక్కువ ధరకు, అదే నాణ్యతతో లభిస్తున్నాయి. జనరిక్ మెడికల్ షాపులను మరిన్ని ఏర్పాటు చేస్తే.. మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కల్యాణిని విరణ కోరగా.. జనరిక్ షాపుల సంఖ్యను పెంచాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని, మెడికల్ షాపుల్లో జనరిక్ మందులను ఎంఆర్‌పీకే విక్రయిస్తున్నారని తెలిపారు.