Share News

పడకేసిన రోడ్ల పనులు

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:31 AM

జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ రహదారుల అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయి. తారు ధర విపరీతంగా పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఒకే కాంట్రాక్టర్‌ పలుచోట్ల రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం వంటి కారణాల వల్ల అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడ’ అన్న చందంగా మారాయి.

పడకేసిన రోడ్ల పనులు
. రావికమతం మండలం గొంప జంక్షన్‌- గుడ్డిప మధ్య బీటీ లేయర్‌ వేయకపోవడంతో రాళ్లు తేలిన రోడ్డు

గతుకులు, గోతులతో ప్రజల అవస్థలు

తారు ధరలపై పశ్చిమాసియా యుద్ధం ప్రభావం

టన్ను రూ.40 వేల నుంచి రూ.92 వేలకు పెరుగుదల

గిట్టుబాటు కాదంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి హెచ్చరించినా.. మొదలుకాని పనులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ రహదారుల అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయి. తారు ధర విపరీతంగా పెరగడం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం, ఒకే కాంట్రాక్టర్‌ పలుచోట్ల రోడ్ల నిర్మాణ పనులు చేస్తుండడం వంటి కారణాల వల్ల అభివృద్ధి పనులు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడ’ అన్న చందంగా మారాయి.

వైసీపీ ఐదేళ్ల పాలనలో రహదారులకు ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి, ఛిద్రం అయిన విషయం తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది గోతులు పూడ్చే పనులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. గత ఏడాది ప్రాధాన్యతాక్రమంలో పలు ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులకు నిధులు మంజూరు చేయడంతో అధికారులు టెండర్లు పిలిచారు. తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. అయితే ఈ ఏడాది మార్చిలో పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కావడంతో తారు దిగుమతిపై తీవ్ర ప్రభావం పడింది. గతంలో టన్ను తారు రూ.40 వేలు వుండగా, యుద్ధం కారణంగా ఇది రూ.92 వేలకు చేరింది. దీంతో పలువురు కాంట్రాక్టర్లు తారుతో చేపట్టాల్సిన రోడ్ల పనులను ఆపేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. సంబంధిత కాంట్రాక్టర్ల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే పనులు పునఃప్రారంభించకపోతే బ్లాక్‌ లిస్టులో పెడతామని హెచ్చరించారు. కానీ కాంట్రాక్టర్లలో ఎటువంటి చలనం లేదు.

చోడవరం మండలం వెంకన్నపాలెం నుంచి వడ్డాది మీదుగా రోలుగుంట మండలం వెలంకాయలపాలెం వరకు బీఎన్‌ రోడ్డు అభివృద్ధి పనులు ఆరు నెలల కిందటే నిలిచిపోయాయి. తారు ధరలు పెరగడమే ఇందుకు కారణమని కాంట్రాక్టర్‌ చెబుతున్నారు.

రావికమతం మండల కేంద్ర నుంచి తట్టబంద వెళ్లే రోడ్డులో గొంప జంక్షన్‌ నుంచి గుడ్డిప గ్రామం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. ఫిబ్రవరి చివరినాటికి మెటల్‌ వేసి చదును చేశారు. తరువాత తారు ధరలు పెరిగాయంటూ బీటీ లేయర్‌ వేయలేదు. ఈ రోడ్డుపై రాళ్లు లేచి, దుమ్ము ధూళి ఎగిసిపడుతుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దేవరాపల్లి మండలం కాశీపురం- బి.కింతాడ రోడ్డు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎస్‌.రాయవరం మండలం పెదఉప్పలం రోడ్డు జంక్షన్‌ నుంచి నర్సీపట్నం వెళ్లే రహదారి పనుల్లో కదలిక లేదు. అనకాపల్లి తుమ్మపాల మీదుగా చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు రహదారి నిర్మాణం నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో పలుచోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షం కురిస్తే నీరు చేరి పంట కుంటలను తలపిస్తున్నాయి. నర్సీపట్నం-తుని ఆర్‌అండ్‌బీ రోడ్డులో నాతవరం మండల పరిధిలో ఏడు నెలలైనా పనులు మొదలు కాలేదు.

Updated Date - Jul 31 , 2026 | 12:31 AM