రహదారులు వర్షార్పణం
ABN , Publish Date - Apr 14 , 2026 | 01:17 AM
గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయం కోసం రహదారుల నిర్మాణం పేరుతో ఖర్చు చేస్తున్న ఉపాధి హామీ నిధులు వృథా అవుతున్నాయి.
నిర్మించిన కొద్ది రోజులకే కొట్టుకుపోయిన రోడ్లు
గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయం కోసం ఉపాధి నిధులు మంజూరు
అర్ల- పిత్రిగెడ్డ రహదారికి రూ.రూ.4.1 కోట్లు, వైబీ పట్నం- లోసింగి రోడ్డుకు రూ.2.5 కోట్లు
గత ఏడాది మార్చిలోగా మెటల్ లేయర్ పనులు పూర్తి
తరువాత వర్షాలకు నామరూపల్లేకుండా కొట్టుకుపోయిన రోడ్లు
అయినాసరే కాంట్రాక్టర్లకు రూ.80 లక్షల మేర బిల్లుల చెల్లింపు
మళ్లీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయం కోసం రహదారుల నిర్మాణం పేరుతో ఖర్చు చేస్తున్న ఉపాధి హామీ నిధులు వృథా అవుతున్నాయి. సంబంధిత శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, క్షేత్రస్థాయిలో పనులు చేయించే ఇంజనీర్ల అవినీతి కారణంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న రోడ్లు నాణ్యత లేమితో మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. ఏడాది తిరగకుండానే ఆనవాళ్లు లేకుండా వర్షాలకు కొట్టుకుపోతున్నాయి.
రోలుగుంట, రావికమతం మండలాల్లో ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని వున్న మారుమూల గిరిజన గ్రామాలకు రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వం 2024 డిసెంబరులో రూ.6.6 కోట్ల మేర ఉపాధి హామీపథకం నిధులు మంజూరు చేసింది. రోలుగుంట మండలం అర్ల గ్రామం నుంచి పిత్రిగెడ్డ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు వేసి, తరువాత దానిపై తారు రోడ్డు నిర్మించడానికి రూ.4.1 కోట్లు, వైబీ పట్నం నుంచి లోసింగి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర మెటల్ రోడ్డు వేసి, దానిపై తారు రోడ్డు నిర్మించడానికి రూ.2.5 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అర్ల నుంచి పిత్రిగెడ్డ వరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో గత ఏడాది మార్చిచివరి నాటికి మట్టి రోడ్డు పనులను పూర్తిచేశారు. తరువాత బీటీ రోడ్డు వేయాలి. కానీ గత ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు మెటల్‌తోసహా రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. అప్పటి వరకు సుమారు కోటి రూపాయల విలువైన పనులు చేయగా, కాంట్రాక్టర్‌కు రూ.50 లక్షల మేర బిల్లు చెల్లించినట్టు తెలిసింది. వైబీపట్నం నుంచి లోసింగి వరకు మూడు కిలోమీటర్ల మేర గ్రావెల్, మెటల్‌తో రోడ్డు నిర్మించారు. నాలుగుచోట్ల కల్వర్టులు నిర్మించి వదిలేశారు. ఈ రోడ్డు కూడా గత ఏడాది వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. పీఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించింది. ఈ రోడ్డు పనులకు సంబంధించి సుమారు రూ.30 లక్షల మేర కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించినట్టు తెలిసింది. వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయిన తరువాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయంలో కాంట్రాక్టర్ల నుంచి పీఆర్ ఇంజనీర్లు భారీగానే కమీషన్లు పుచ్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా గత ఏడాది వర్షాలకు కొట్టుకుపోయిన అర్ల-పత్రిగెడ్డ, వైబీపట్నం-లోసింగి రోడ్ల నిర్మాణం కోసం పీఆర్, డ్వామా అధికారులు కొత్తగా ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం గతంలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లచేతనే మిగిలిన పనులు పూర్తిచేయాలి. అంతవరకు టెండర్ అగ్రిమెంట్ అమల్లో వుంటుంది. కానీ అధికారులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి, కొత్తగా ప్రతిపాదనలు తయారు చేశారు.
గిరిజనుల ఫిర్యాదులపై స్పందించని అధికారులు
అర్ల- పిత్రిగెడ్డ రోడ్డు దుస్థితిని వివిధ గ్రామాల గిరిజనులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ పరిశీలించడానికి ఒక్కసారి కూడా రాలేదు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిలో సైతం రెండుసార్లు అర్జీలు అందజేశారని, అయినా సరే రోడ్డు నిర్మాణానికి మళ్లీ ప్రతిపాదనలు తయారు చేశారని సీపీఎం నాయకుడు గోవిందరావు ఆరోపిస్తున్నారు. అర్ల- పత్రిగెడ్డ, వైబీపట్నం- లోసింగి రహదారుల నిర్మాణంలో నాణ్యతాలోపాలు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన పీఆర్ ఇంజనీర్లపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.