Share News

ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రోడ్లు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:47 AM

నగరంలో రహదారులను విస్తరించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది.

ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రోడ్లు

గత ఏడాది ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో రహదారుల మార్జిన్లు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణల తొలగింపు

మళ్లీ మొదటికొచ్చిన వైనం

ఈసారి రెట్టింపు సంఖ్యలో ఏర్పాటు

చర్యలకు అధికారుల వెనకడుగు...నేతల ఒత్తిడే కారణం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో రహదారులను విస్తరించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. వాహనాల సంఖ్య పెరిగింది. కానీ రహదారులు మాత్రం అవే. ఎక్కడా విస్తరించలేదు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందు ఎక్కడికక్కడ ‘ఫ్రీ లెఫ్ట్‌లు’ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆ పనులు పూర్తికాలేదు.

ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా ఉండేందుకు రహదారుల పక్కన ఆక్రమణల తొలగింపునకు గత ఏడాది జూలై 27న ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. రోడ్డు మార్జిన్లలో ఉన్న దుకాణాలను తొలగించారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కొందరు ప్రజా ప్రతినిధులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ దఫదఫాలుగా సంక్రాంతి వరకూ కొనసాగించారు. ఇలా నాలుగు విడతలుగా నగరంలో సుమారు 40 వేల ఆక్రమణలు, దుకాణాలు తొలగించారు. ఆ తరువాత పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈసారి వ్యాపారాలు దుకాణాలు కాకుండా మొదట బండ్లు పెట్టుకొని చేసుకోవాలని నాయకులు సూచించడంతో కొందరు అలాగే మొదలెట్టారు. పోలీసులు వస్తే బండ్లను తోసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇది ఉగాది వరకూ సాగింది. ఆ తరువాత పూర్తిస్థాయి దుకాణాలు తెరిచారు. సీతమ్మధార, ఎంవీపీ కాలనీ, ఎన్‌ఏడీ జంక్షన్‌, గాజువాక, మద్దిపాలెం, వెంకోజీపాలెం...ఇలా అన్నిచోట్ల తిరిగి అదేస్థానంలో ఆక్రమణలు వచ్చేశాయి. చెప్పాలంటే అంతకుముందు కంటే రెట్టింపయ్యాయి. ఫుట్‌పాత్‌లు నడవడానికి వీల్లేకుండా మారిపోయాయి.

ఇప్పుడు రోడ్డుకు రెండు వైపులా

భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే దారిలో పాత వెంకోజీపాలెం మెడికవర్‌ ఆస్పత్రి సమీపాన జాతీయ రహదారికి ఎడమ వైపు ఉన్న పండ్ల దుకాణాల వద్ద రద్దీ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని రెండు నెలల క్రితం వాటిని తొలగించారు. నేతల మద్దతుతో ఇప్పుడు మళ్లీ అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈసారి రోడ్డు రెండో వైపు అంటే...చందన మోహనరావు ఫంక్షన్‌ హాలు రోడ్డు వైపు కూడా పండ్ల దుకాణాలు పెట్టి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాది పెట్టుబడిదారుల సదస్సుకు ఏర్పాట్ల నిమిత్తం ప్రభుత్వం ఏకంగా రూ.400 కోట్లు కేటాయించింది. ఈ పనులు ప్రారంభించారు. రహదారుల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, ఆధునిక విద్యుద్దీపాలు ఏర్పాటు వంటివి చేయనున్నట్టు చెబుతున్నారు. ఇంకా పక్కాగా పనుల వివరాలు వెల్లడించలేదు. పనిలోపనిగా రహదారుల పక్కన ఆక్రమణలు తొలగిస్తారా?, అలాగే వదిలేస్తారా?...అనేది స్పష్టత లేదు. నాయకులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు. స్వయం ఉపాఽధి పొందేవారిని దెబ్బతీయడం తగదనేది వారి వాదన. వారికి ప్రత్యేకంగా వెండింగ్‌ జోన్లు పెడుతున్నామని, అక్కడకు వెళ్లాలని జీవీఎంసీ అధికారులు అంటున్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:47 AM