Share News

రహ‘దారులు’ లేక ఇక్కట్లు

ABN , Publish Date - Mar 15 , 2026 | 10:50 PM

స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రవాణా సౌకర్యం లేక అత్యవసర సమయాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. మండలంలో కుంతుర్ల పంచాయతీలోని గ్రామాలకు తరతరాలుగా రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

రహ‘దారులు’ లేక ఇక్కట్లు
ప్రమాదభరితంగా ఉన్న కుంతుర్ల పంచాయతీలో రహదారి.

కుంతుర్ల పంచాయతీలో 10 గ్రామాలకు రవాణా కష్టాలు

ఎనిమిదేళ్లుగా పూర్తి కాని కిండలం రోడ్డు

మరమ్మతులకు నోచుకోని రాసగుప్ప-గొలుగొండ బీటీ రోడ్డు

గ్రామాలకు రోడ్లు వేయాలని వేడుకోలు

పెదబయలు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): కుంతుర్ల పంచాయతీ పరిధిలోని కే బొడ్డాపుట్టు, కిండలం, లుగసరిపుట్టు, కందులగుంట గ్రామాలకు కిముడుపల్లి నుంచి కిండలం వరకు ఉన్న రహదారే ప్రధాన మార్గం. ఈ మార్గం ద్వారా పాడేరు, జీ మాడుగుల, పెదబయలు, చింతపల్లి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. కుంతుర్ల చేరుకోవడానికి ఇదే రహదారి. కిముడుపల్లి-కిండలం రహదారి నిర్మాణానికి పనులు మొదలు పెట్టి ఎనిమిదేళ్లు గడిచినా నేటికీ పూర్తి కాలేదు. దీంతో ఆయా గ్రామాల గిరిజనులు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాలన్నా.. నిత్యావసర వస్తువులు, రేషన్‌ డిపోల్లో సరుకులు తెచ్చుకోవాలన్నా.. వైద్య సేవలు పొందాలన్నా.. ఎన్నో అవస్థలు పడుతున్నారు. అత్యవసరాల్లో ఆస్పత్రికి వెళ్లాలంటే డోలీ కట్టి ఆస్పత్రికి తరలించే పరిస్థితి దాపురించింది. వర్షాకాలంలో బాలింతలకు డోలీ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రైతులు పండించిన పంటలు వారపు సంతకు తరలించి విక్రయించాలన్నా రోడ్డు సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నెలల తరబడి ఆయా గ్రామాల గిరిజనులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోతాయి. రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు అధికారులకు ఎన్ని పర్యాయాలు మొర పెట్టుకున్నా స్పందించే వారే లేకుండా పోయారని గిరిజనులు వాపోతున్నారు. అలాగే రాసగుప్ప నుంచి గొలుగొండ వరకు గతంలో వేసిన బీటీ రోడ్డు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో అటువైపు గల ఐదు గ్రామాల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డుకు మరమ్మతులు కూడా చేయలేదని గిరిజనులు చెబుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి కుంతుర్ల పంచాయతీలోని గ్రామాలకు రహదారులు వేయాలని గిరిజనులు కోరుతున్నారు.

కుంతుర్ల పంచాయతీలో రోడ్లు లేని గ్రామాలు

మొయ్యాలగుమ్మి-కే బొడ్డాపుట్టు 6 కి.మీ

బొడ్డాపుట్టు-కిముడుపల్లి 10 కి.మీ

లుగసరిపుట్టు-గొలుగొండ 5 కి.మీ

సంపంగిపుట్టు-పాతపాడు 6 కి.మీ

కందులగుంట-పాతపాడు 5 కి.మీ

రోడ్డు సౌకర్యం కల్పించాలి

- మణుగూరు బాబూజీ, జీఎస్‌యూ నేత

ఎన్ని ప్రభుత్వాలు మారినా కుంతుర్ల పంచాయతీలో పలు గ్రామాలకు రహదారులు వేయకపోవడం విచారకరం. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకునే నాథులే కరువయ్యారు. తమ పంచాయతీలో ఈ వర్షకాలంలోపు రహదారులు నిర్మించాలి.

రోడ్డు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోయాం

మర్రి కాసులమ్మ, మర్రిదాటు గ్రామం

తమ గ్రామాలకు రోడ్డు లేకపోవడంతో అత్యవసరాల్లో డోలీ ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయాం. నిత్యం రవాణా కష్టాలు పడుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి తమ పంచాయతీలో రహదారులు నిర్మించాలి.

Updated Date - Mar 15 , 2026 | 10:50 PM