రహదారులు ఛిద్రం
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:30 AM
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. శుక్రవారం నాటికి వర్షాలు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రోడ్లపై ఏర్పడిన గోతులు ఇప్పుడు వాహనచోదకులు, ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ రోడ్లన్నీ వర్షాలకు గోతులమయంగా మారాయి.
- భారీ వర్షాలకు గోతులమయం
- వాహనచోదకుల అవస్థలు
- నష్టం అంచనాలు రూపొందించడంలో యంత్రాంగం నిమగ్నం
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. శుక్రవారం నాటికి వర్షాలు తగ్గడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించినప్పటికీ రోడ్లపై ఏర్పడిన గోతులు ఇప్పుడు వాహనచోదకులు, ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ రోడ్లన్నీ వర్షాలకు గోతులమయంగా మారాయి.
గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో అనుసంధానించే పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లతో పాటు రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ప్రధాన రహదారులు వర్షపు నీటిలో మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లపై తారు కొట్టుకుపోయి గోతులు ఏర్పడ్డాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు భారీ వర్షాల వల్ల రోడ్లకు జరిగిన నష్టం అంచనాలను ఆర్ అండ్ బీ, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం వెళ్లే రోడ్డులో మార్టూరు జంక్షన్ వద్ద ఆర్ అండ్ బీ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఇదే రోడ్డులో తుమ్మపాల వద్ద ఏలేరు కాలువ వంతెన వద్ద రోడ్డు దెబ్బతినడంతో అటుగా వెళ్లే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల్లో బీఎన్ రోడ్డు వర్షపు నీటితో నిండిపోయి భారీ గుంతలు ఏర్పడ్డాయి. రోలుగుంట ఆస్పత్రి వద్ద, కొమరవోలు, దొండపూడి, అర్జాపురం, పొడిదొరపాలెం, కొమల్లపూడి, తదితర గ్రామాల రోడ్లు వర్షాలకు గోతులమయంగా మారాయి. పరవాడ మండలం మెట్టపాలెం నుంచి పాత రాజానపాలెం వెళ్లే రోడ్డు, రావాడ శివారు బొట్టావానిపాలెం జంక్షన్ నుంచి రేఖవానిపాలెం వెళ్లే రోడ్డు, వెన్నెలపాలెం నుంచి తలపాక వెళ్లే రోడ్డు వర్షాలకు దెబ్బతింది. బుచ్చెయ్యపేట మండలంలో బీఎన్ రోడ్డుపై నీరు చేరడంతో ఇబ్బందులు తలెత్తాయి. సబ్బవరం మండలం అసకపల్లి నుంచి లంకెలపాలెం వెళ్లే రోడ్డులో పైడివాడ అగ్రహారం వద్ద ఇటీవల మరమ్మతులు చేపట్టిన రోడ్డు వర్షాలకు కొట్టుకుపోయింది. చోడవరం మండలం పీఎస్ పేట రోడ్డు అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు మరింత దుర్భరంగా మారింది. రోడ్డుపై అడుగడుగునా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ విషయంపై పీఆర్ ఈఈ జగదీశ్ వివరణ కోరగా, జిల్లాలో వర్షాల కారణంగా రోడ్లకు పెద్దగా నష్టం జరగలేదన్నారు. కొన్ని మండలాల్లో రోడ్లపై గుంతలు ఏర్పడిన మాట వాస్తవమేనని, వాటి వివరాలు సేకరించి మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు.