అధ్వానంగా రహదారులు
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:34 AM
నగరంలో పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి.
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు
మరమ్మతులకు రూ.14 కోట్లు అవసరమని అంచనా
పనులు చేపట్టడంలో జీవీఎంసీ జాప్యం
ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో పలు రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల ‘అర్నబ్’ తుఫాన్ దెబ్బకు కొన్ని ప్రధాన రోడ్లతోపాటు బీటీ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుకు సుమారు రూ.14 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ అధికారులు తయారుచేసిన అంచనాలు కాగితాలకే పరిమితం అయ్యాయి. రోడ్లపై పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహన చోదకులు ప్రమాదాల బారినపడుతున్నారు.
జీవీఎంసీ పరిధిలో తగరపువలస నుంచి వడ్లపూడి వరకు 73 కిలోమీటర్లు పొడవున జాతీయ రహదారి ఉంది. అదికాకుండా నగరంలో అంతర్గతంగా వెయ్యి కిలోమీటర్లు పొడవైన తారు రోడ్లు ఉన్నాయి. వీటిలో చాలావరకూ ప్రధాన మార్గాలు కాగా, కొన్ని శివారు ప్రాంతాలను అనుసంధానించేవి ఉన్నాయి.
నగరంలో తరచూ రాష్ట్ర, జాతీయస్థాయి సదస్సులు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో జీవీఎంసీ నిరంతరం రహదారుల నిర్వహణ పనులు చేస్తూనే ఉంటుంది. రోడ్ల మరమ్మతులు, ఇతర పనులకు ఏటా రూ.90 కోట్ల వరకు వెచ్చిస్తోంది. రోడ్లపై గుంతలను పూడ్చడం, దెబ్బతిన్న రోడ్లపై కొత్తగా బీటీ లేయర్ వేయడం వంటివి చేస్తుంటుంది. అయితే గత నెల అర్నబ్ తుఫాన్ కారణంగా నగరంలో మూడు రోజులపాటు తెరిపిలేకుండా వర్షాలు కురిశాయి. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోవడం, అదే సమయంలో భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో గుంతలు ఏర్పడ్డాయి. జీవీఎంసీ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సుమారు రూ.14 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. కానీ ఎందుచేతనోగానీ కొన్ని ప్రధాన మార్గాలు మినహా మిగిలిన రోడ్ల మరమ్మతులను పూర్తిచేయలేకపోయారు. దీంతో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వేన్యూకాలనీ, దొండపర్తి, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, అక్కయ్యపాలెం, ద్వారకానగర్, జగదాంబ జంక్షన్, వన్‌టౌన్, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మద్దిలపాలెం జంక్షన్‌కు వెళ్లే మార్గంతోపాటు మరికొన్ని రహదారుల్లో భారీగుంతలు ఏర్పడ్డాయి. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.