Share News

నెల రోజుల్లో వీఈఆర్‌కు రోడ్‌మ్యాప్‌

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:11 AM

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)కు నెల రోజుల్లో రోడ్‌మ్యాప్‌ తయారు చేయనున్నట్టు కన్వీనర్‌, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌ వెల్లడించారు.

నెల రోజుల్లో వీఈఆర్‌కు రోడ్‌మ్యాప్‌

కాపులుప్పాడలో ఫిన్‌టెక్‌ సిటీ

పోర్టులన్నీ కలుపుతూ లాజిస్టిక్స్‌ కారిడార్‌

ఆ ఐదు పంచాయతీల్లో ‘సీఆర్‌జెడ్‌’ ప్రజాభిప్రాయ సేకరణ

వీఎంఆర్‌డీఏ మెట్రో పాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌ భరత్‌

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)కు నెల రోజుల్లో రోడ్‌మ్యాప్‌ తయారు చేయనున్నట్టు కన్వీనర్‌, వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ తేజ్‌భరత్‌ వెల్లడించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ, వీఈఆర్‌ అంటే విశాఖపట్నం ఒక్కటే కాదని, పోలవరంతో కలిపి మొత్తం పది జిల్లాల అభివృద్ధికి సంబంధించినదని వివరించారు. నీతి ఆయోగ్‌ వీఈఆర్‌లో 48 ప్రాజెక్టులు ప్రతిపాదించగా, అందులే బే సిటీ అనేది ఒకటని, అది విశాఖకు పరిమితంగా ఉంటుందన్నారు. ఈ రీజియన్‌లో ఐటీ సిటీ, స్టీల్‌ సిటీ, ఏరో సిటీ, ఇండస్ట్రియల్‌ సిటీ, టూరిజం సిటీ, మాన్యుఫ్యాక్చరింగ్‌ సిటీలకు ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆదేశించారన్నారు. కాపులుప్పాడలో ఐటీ సంస్థల అభివృద్ధికి అనువుగా పది ఎకరాల్లో ‘ఫిన్‌టెక్‌ సిటీ’ అభివృద్ధి చేస్తామన్నారు. తీరం వెంబడి ఉన్న పోర్టులన్నింటినీ కలుపుతూ లాజిస్టిక్స్‌ కారిడార్‌ రూపొందించాల్సి ఉందన్నారు.

సీఆర్‌జెడ్‌ 3 నుంచి 2 కోసం గ్రామసభలు

విశాఖపట్నంలో ఐదు పంచాయతీలు (చేపలుప్పాడ, కాపులుప్పాడ, జీవీ అగ్రహారం, నిడిగట్టు, కె.నగరంపాలెం) సీఆర్‌జెడ్‌-3 పరిధిలో ఉన్నాయని, అయితే వాటిని గ్రామీణ ప్రాంతాలుగా గుర్తించి అభివృద్ధికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. వాస్తవానికి ఆ ఐదు పంచాయతీలను 2013లోనే జీవీఎంసీలో చేర్చారని, వాటిపై కోర్టులో స్టే ఉండడం వల్ల ఇబ్బంది వచ్చిందన్నారు. సీఆర్‌జెడ్‌-2019 చట్టం ప్రకారం వాటిని నగర పరిఽదిలోకి తీసుకురావాలంటే... ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సి ఉందన్నారు. దీనికి సీఎం చంద్రబాబునాయుడు అనుమతి ఇచ్చారని, త్వరలోనే గ్రామసభలు పెట్టి, ఆయా పంచాయతీలను సీఆర్‌జెడ్‌-3 నుంచి 2లోకి మార్చడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామన్నారు. వాటికి ఆమోదం లభిస్తే ఆయా తీర ప్రాంత గ్రామాల్లో కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంటుందని, దాని ద్వారా పెట్టుబడులతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు.

వీఈఆర్‌ అంటే ప్రాజెక్టులు మాత్రమే కాదని, వాటి వల్ల ఆయా ప్రాంతాలు, అక్కడి ప్రజలు ఎలా అభివృద్ధి చెందుతారో పక్కా ప్రణాళిక రూపొందించి, వారిని కూడా అందులో భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని, ఆ ప్రకారం కొత్త రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామని తేజ్‌ భరత్‌ వివరించారు.

Updated Date - Aug 07 , 2026 | 01:11 AM