జలాంతర్గామి సోనార్‌ల వినియోగంపై రోడ్ మ్యాప్
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:11 AM
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఓటర్ల జాబితాను సంస్కరించేందుకు ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది.
సదస్సులో తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్ మీనన్
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జలాంతర్గామి సోనార్‌ల సమర్ధ వినియోగానికి రోడ్ మ్యాప్ అంశంపై తూర్పు నౌకాదళంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. సదస్సుకు తూర్పు నౌకాదళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్‌మీనన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్న పరిశ్రమల నిపుణులు, ఆత్మ నిర్భ ర్ కార్యక్రమం కింద రూపుదిద్దుకుంటున్న నూతనతరం సోనార్ వ్యవస్థలను నిర్వహిస్తున్న యుద్ధ నిపుణులు, వ్యవస్థల నిర్వహణ సిబ్బంది, విద్యా సంస్థలు, నిపుణులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై పలువురు చేపట్టిన పరిశో ధనా పత్రాలను సమర్పించారు. వీటిలో జలాంతర్గామి సోనార్‌ల సమర్థ వినియోగం, ఆపరేటర్ల మానవ వనరుల సమర్థీకరణ, డేటాబేస్ నిర్వహణలో కొత్త భావనలు, అభి వృద్ధి చెందుతున్న సాంకేతికతల సమీకరణ వంటి పత్రా లున్నాయి. సదస్సులో నేవీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
వన్‌టౌన్‌లో పెరిగిన కాలుష్యం
ఐరన్‌వోర్ బెల్టుల నుంచి లీకైన ధూళి
నగరంలో కాలుష్యంపై 10న కలెక్టరేట్‌లో సమావేశం
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి)
ధూళి కాలుష్యంతో వన్‌టౌన్ కోటవీధి నుంచి జ్ఞానాపురం వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎర్రటి బుగ్గి ఇళ్లు, రోడ్లపైకి వ్యాపించడంతో ఆందోళనకు గురయ్యారు. జ్ఞానాపురం వెనుక రెండు బెల్టుల నుంచి ముడి ఇనుము పోర్టులోని బెర్తుల్లో ఉన్న నౌకలలో లోడింగ్ చేసే క్రమంలో లీకవడంతో ఒక్కసారిగా ధూళి తీవ్రత పెరిగింది. బెల్టుల నుంచి ముడిఇనుము రవాణాచేసే క్రమంలో పక్కాగా బెల్టుమూసి ఉంటుంది. అయితే బెల్టుకు రంధ్రాలు పడినా, ఇతరత్రా లీకులున్నా జ్ఞానాపురం నుంచి కోటవీధి వరకు సుమారు రెండుమూడు కిలోమీటర్ల పొడవునా కిందకు ధూళి పడుతుంది. రెండు మూడు రోజులుగా ఈ పరిస్థితి తలెత్తడంతో ఇళ్లు, రోడ్లు, ఇళ్ల ముందు నిలిపి ఉంచిన వాహనాలపై ఎర్రటి బుగ్గి పేరుకుపోయింది. పచ్చగా ఉండాల్సిన చెట్లు ఎర్రని ధూళితో కప్పబడ్డాయి. దీనికితోడు పోర్టు బెర్తులలో ఎగుమతి, దిగుమతి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలపై ధూళి కమ్మేస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపై ఎర్రటి బుగ్గి పడిన నేపథ్యంలో కోటవీధికి చెందిన స్థానికులు కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పీవీ ముకుందరావుకు ఫోన్‌లో సమాచారం అందించారు. అయితే రెండు రోజులుగా వర్షం కురవడంతో ధూళి ప్రభావం కొంత తగ్గిందని చెబుతున్నారు. వేదాంత, ఆర్సెల్లార్ మిట్టల్ కంపెనీలకు చెందిన బెల్టుల నుంచి ఐరన్ వోర్ రవాణా జరుగుతుందని, ఎక్కడ లీకులున్నాయో పరిశీలించి, ఆయా కంపెనీలకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై పీసీబీ ఈఈ ముకుందరావు వద్ద ప్రస్తావించగా క్షేత్రస్థాయిలో పర్యటించి కాలుష్యం తీవ్రతను గుర్తించి సంబంధిత కంపెనీలకు నోటీసులు ఇస్తామన్నారు. కాగా నగరంలో కాలుష్య పరిస్థితిపై ఈనెల పదో తేదీన కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించి, నివారణ చర్యలపై చర్చించనున్నారు.
రెండుచోట్ల ఓటు ఉంటే నేరమే!
ఉపాధి నిమిత్తం పట్టణానికి వలస వచ్చినా సొంతూరులోనూ అనేక మందికి ఓటు
‘సర్’తో అటువంటి వారికి చెక్
ఓటర్లు భారీగా తగ్గే అవకాశం?
విశాఖపట్నం, జూలై 5 (ఆంధ్రజ్యోతి):
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా ఓటర్ల జాబితాను సంస్కరించేందుకు ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంది. ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. రెండు ఓట్లు ఉంటే భారత ఎన్నికల చట్టం 1950లో సెక్షన్ 31 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. సదరు వ్యక్తిపై కేసు నమోదుచేస్తారు. ఇదే విషయాన్ని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒక వ్యక్తి దేశంలో ఎక్కడైనా ఒక చోట మాత్రమే ఓటరుగా ఉండాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అనేక కారణాలతో ఒకరు రెండుచోట్ల ఓటరుగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో ఒకచోట మాత్రమే ఓటు వేస్తున్నారు.
గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారిలో ఎక్కువ మంది సొంతూరులో ఓటరుగా ఉండేందుకు ఇష్టపడతారు. అదే సమయంలో తాముంటున్న నగరం/పట్టణంలో కూడా ఓటరుగా నమోదవుతుంటారు. ఎన్నికల సమయంలో ఏదో ఒకచోట ఓటు హక్కు వినియోగించుకుంటారు. కొందరు మాత్రం నివాసం ఉన్నచోట ఓటు వేసిన అనంతరం సొంతూరు వెళ్లి ఓటేస్తుంటారు.
విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలోని మిగిలిన జిల్లాల నుంచి చాలామంది ఉపాధి కోసం వలస వస్తుంటారు. ఏళ్ల తరబడి ఇక్కడే నివాసం ఉన్నా...సొంతూరులోనూ ఓటు ఉంటుంది. వారంతా ఓటరుగా ఎక్కడ కొనసాగదలు చుకున్నారో ఇప్పుడు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. నగరంలోని మధురవాడ, ఆరిలోవ, గాజువాక, అక్కయ్యపాలెం, వన్‌టౌన్, పెందుర్తి, తదితర ప్రాంతాల్లో వలస ఓటర్లు ఎక్కువ. సొంతూరులో ఓటు ఉండాలని నిర్ణయించుకుంటే నగరంలో ఓటర్ల జాబితా నుంచి తమ పేరు తొలగించుకోవాలి. అప్పుడు విశాఖలో ఓటర్లు భారీగా తగ్గుతారని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ నగరంలో ఓటు కావాలని భావిస్తే ఉత్తరాంధ్రలోని పలు అసెంబ్లీల నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తగ్గుతారని చెబుతున్నారు.