Share News

తీరిన రహదారి కష్టాలు

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:28 PM

జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలంలోని పెద్దగెడ్డ- కొండవంచుల పరిసర 24 గ్రామాలను కలుపుతూ రూ.2 కోట్ల నాబార్డు నిధులతో కూటమి ప్రభుత్వం తారురోడ్డు నిర్మించింది.

తీరిన రహదారి కష్టాలు
పెద్దగెడ్డ- యర్రబొమ్మలు మధ్య నిర్మించిన తారురోడ్డు

రూ.2 కోట్లతో పెద్దగెడ్డ- పెద్దూరు గ్రామాల మధ్య తారురోడ్డు నిర్మాణం

గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం

కూటమి ప్రభుత్వం వచ్చాక మోక్షం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు రుణపడి ఉంటామంటున్న ఆదివాసీలు

చింతపల్లి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధ్వానంగా ఉన్న రహదారుల పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండలంలోని పెద్దగెడ్డ- కొండవంచుల పరిసర 24 గ్రామాలను కలుపుతూ రూ.2 కోట్ల నాబార్డు నిధులతో కూటమి ప్రభుత్వం తారురోడ్డు నిర్మించింది. తారురోడ్డు నిర్మాణంతో రవాణా కష్టాలు, డోలీమోతలు తప్పాయని ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తారురోడ్డు నిర్మించాలని అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయిందని గిరిజనులు తెలిపారు.

చింతపల్లి- నర్సీపట్నం ప్రధాన రహదారి పెద్దగెడ్డ నుంచి కొండవంచుల వరకు గతంలో మెటల్‌ రోడ్డు ఉండేది. గత టీడీపీ ప్రభుత్వం 2018లో ఈ రహదారిపై తారురోడ్డు నిర్మాణానికి 1.75 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ రహదారి నిర్మాణాలకు అవసరమైన ఎర్తువర్కు పనులు కొంత వరకు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ 25 శాతం పనులు పూర్తికాలేదని టెండర్‌ను రద్దు చేసింది. దీంతో ఈ రహదారి నిర్మాణం మరుగునపడిపోయింది. ఐదేళ్లపాటు ఈ ప్రాంత ఆదివాసీలు రహదారి నిర్మాణానికి పలు మార్లు వైసీపీ పాలకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికి స్పందించలేదు.

24 గ్రామాల ప్రజలకు ఆధారం

పెద్దగెడ్డ- కొండవంచుల, పెద్దూరు రహదారి 24 గ్రామాలకు ఆధారం. ప్రతి రోజు ఆదివాసీలు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు ఈ మార్గం గుండానే వెళుతుంటారు. గిరిజనులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ఈ మార్గం మీదుగా సంతలకు తరలించి విక్రయిస్తుంటారు. అయితే వర్షాలు కురిసినప్పుడు వాహనాలు బురదలో కూరుకుపోయి ఇబ్బందులు పడేవారు. ఆటోలు, ద్విచక్రవాహనాలు ఈమార్గంపై ప్రయాణించడం వల్ల తరచూ మరమ్మతులకు గురయ్యేవి.

ఆర్టీసీ సర్వీసు రద్దు

పెద్దగెడ్డ- కొండవంచుల గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉండేది. నర్సీపట్నం డిపోనకు చెందిన బస్సు చింతపల్లి నుంచి ప్రతి రోజు నాలుగు సార్లు తిరిగేది. అయితే రహదారి అత్యంత అధ్వానంగా తయారైందని ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసును రద్దు చేశారు. బస్సు సర్వీసును పునరుద్ధరించాలని స్థానిక గిరిజనులు ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తే రోడ్డుకు మరమ్మతులు చేపడితే బస్సు సర్వీసును పునరుద్ధరిస్తామని చెప్పేవారు. గత వైసీపీ ప్రభుత్వం రహదారి మరమ్మతులు చేపట్టకపోవడంతో బస్సు సర్వీసు పునరుద్ధరణ జరగలేదు.

కూటమి ప్రభుత్వం చొరవతో..

ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం చొరవతో పెద్దగెడ్డ- కొండవంచుల గ్రామాలకు తారురోడ్డు నిర్మాణం జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో స్థానిక గిరిజనులు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి సహకారంతో గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి తాము ఎదుర్కొంటున్న రవాణా కష్టాలను వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఆర్‌ ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు పంపించిన ఏడాదికి 2025 సెప్టెంబరులో తారురోడ్డు నిర్మాణానికి రూ.రెండు కోట్ల నాబార్డు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. వర్షాల కారణంగా నిర్మాణాలు ఆలస్యమైనప్పటికి టెండర్‌ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి జూన్‌లో పనులు ప్రారంభించారు. రెండు నెలల వ్యవధిలో 11 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పూర్తి చేశారు.

Updated Date - Aug 16 , 2026 | 11:28 PM