Share News

రోడ్‌ టెర్రర్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:27 AM

ఎలమంచిలి సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. దీనికి సంబంధించి ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశా నుంచి కాకినాడకు వరి కోత యంత్రాన్ని వ్యాన్‌లో తీసుకెళుతుండగా.. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కొక్కిరాపల్లి జంక్షన్‌ సమీపంలో వ్యాన్‌ బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో ఒడిశాకు చెందిన డ్రైవర్‌ రతన్‌ పూజారి(48), కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం (30) కిందకు దిగి పరిశీలిస్తున్నారు.

రోడ్‌ టెర్రర్‌
ట్రాలర్‌ లారీ ఢీకొన్న తరువాత డివైడర్‌పైకి ఎక్కిన వ్యాన్‌

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఎలమంచిలి వద్ద వ్యాన్‌ను డీకొన్న ట్రాలర్‌ లారీ

ఇద్దరు దుర్మరణం

నక్కపల్లి, అచ్యుతాపురం మండలాల్లో ద్విచక్రవాహనాలు అదుపు తప్పి ఇద్దరు..

సముద్రంలో నాటు పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృత్యువాత

---

జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతిచెందారు. ఎలమంచిలి వద్ద వ్యాన్‌ను ట్రాలర్‌ లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నక్కపల్లి మండలం జానకయ్యపేట వద్ద స్కూటీ అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోవడంతో బాలుడు మృతిచెందాడు. అచ్యుతాపురం మండలం కొండకర్ల జంక్షన్‌ వద్ద గొయ్యిలో బైక్‌ పడి ఒక యువకుడు చనిపోయాడు. ఇదే మండలం పూడిమడక వద్ద సముద్రంలో నాటు పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతిచెందాడు.

-----

ఎలమంచిలి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. దీనికి సంబంధించి ఎస్‌ఐలు సావిత్రి, ఉపేంద్ర తెలిపిన వివరాలిలా వున్నాయి. ఒడిశా నుంచి కాకినాడకు వరి కోత యంత్రాన్ని వ్యాన్‌లో తీసుకెళుతుండగా.. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో కొక్కిరాపల్లి జంక్షన్‌ సమీపంలో వ్యాన్‌ బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో ఒడిశాకు చెందిన డ్రైవర్‌ రతన్‌ పూజారి(48), కాకినాడ జిల్లా కరప మండలం గొడ్డటిపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి సుబ్రహ్మణ్యం (30) కిందకు దిగి పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న ట్రాలర్‌ లారీ అతివేగంగా వచ్చి వీరిద్దరితోపాటు వ్యాన్‌ను ఢీకొని పక్కనే ఉన్న గొయ్యిలోకి దూసుకుపోయింది. వరి కోత యంత్రాన్ని తీసుకెళుతున్న వ్యాన్‌ డివైడర్‌పైకి ఎక్కి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రతన్‌ పూజారి, సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు. హైవే అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎలమంచిలి పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

స్కూటీ అదుపు తప్పి బాలుడి దుర్మరణం

నక్కపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జానకయ్యపేట రోడ్డులో ఆదివారం ఉదయం 11.30 గంటలకు జరిగిన ప్రమాదంలో బాలుడు మృతిచెందాడు. నక్కపల్లికి చెందిన కర్రి సూర్య వెంకటసాయి (13), విత్తనాల నాగ దుర్గ స్కూటీపై వెళుతూ.. జానకయ్యపేట రోడ్డులో పక్కన వున్న కల్వర్టును తప్పించబోయి కాలువలోకి పడిపోయారు. దీంతో వెంకట సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. నాగదుర్గకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాహిబా అంజుమా చెప్పారు.

గొయ్యిలో బైక్‌ పడి యువకుడి మృతి

అచ్యుతాపురం జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండకర్ల జంక్షన్‌ వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నగరంలోని పెదగంట్యాడ మండలం సీతానగరానికి చెందిన నక్కా సంపత్‌ యాదవ్‌ (24), ధర్మాన తేజ, దాసరి గంగాధర్‌ కలిసి శనివారం రాత్రి అచ్యుతాపురంలో ఒక ఫంక్షన్‌కు వచ్చారు. అనంతరం అనకాపల్లి మీదుగా పెదగంట్యాడ వెళ్లేందుకు ముగ్గురూ కలిసి ఒకే బైక్‌పై బయలుదేరారు. కొండకర్ల సమీపంలో రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశం వద్ద బైక్‌ అదుపుతప్పి గొయ్యిలో పడింది. దీంతో ముగ్గురికీ గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు పంపారు. అక్కడ చికిత్స పొందుతూ సంపత్‌ యాదవ్‌ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

సముద్రంలో నాటు పడవ బోల్తా.. మృత్యకారుడి మృతి

అచ్యుతాపురం, జూన్‌ 14 (ఆంరఽధజ్యోతి): సముద్రంలో చేపల వేటకు వెళ్లిన నాటు పడవ బోల్తా పడింది. బోటులో వున్న ముగ్గురు మత్స్యకారుల్లో ఇద్దరు క్షేమంగా ఒడ్డుకు చేరగా, మరొకరు మృత్యువాతపడ్డారు. ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలారిపాలెం గ్రామానికి చెందిన వాడమదుల కోటబాబు, వాడమదుల నూకరాజు, పూడిమడక శివారు పెద్దూరుకి చెందిన పేర్ల దేముడు (44) కలిసి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నాటు పడవపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. అమావాస్య కావడంతో సముద్రం ఒకింత అల్లకల్లోలంగా వుండి అలలు ఎక్కువ ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. సుమారు ఐదున్నర గంటలకు తీరం నుంచి నాలుగు మైళ్ల దూరంలో చేపల వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో అలల ఉధృతికి పడవ బోల్లా పడింది. దీంతో ముగ్గురూ నీటిలో పడిపోయారు. కోటబాబు, నూకరాజు వెంటనే తేరుకొని, నీటిలో ఈదుకుంటూ బోల్తాపడిన పడవను యథాస్థానంలోకి తెచ్చారు. దేముడు కొంచెం దూరానికి కొట్టుకుపోయి ఈదుతూ కనిపించాడు. కోటబాబు తాడు తీసుకొని ఈదుకుంటూ దేముడు వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే నీరు బాగా తాగేసి వుండడంతో స్పృహ కోల్పోయాడు. దేముడు నడుముకు తాడుకట్టి, పడవకు వద్దకు చేర్చాడు. అయితే అప్పటికే దేముడు మృతిచెందాడు. దీంతో మృతదేహాన్ని తీరానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పెద్దూరు, జాలారిపాలెం, కడపాలెం, కొండపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. దేముడు మృతదేహాన్ని చూసి భార్య దేముడమ్మ, కుమార్తెలుశాంతి, కృప కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటరావు తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 12:27 AM