Share News

రహదారి విస్తరణ పనులు చకచకా

ABN , Publish Date - Mar 17 , 2026 | 12:00 AM

జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా పాడేరులోని మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విజయనగరానికి నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో భాగంగా పాడేరుకు శివారున 13 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసింది.

రహదారి విస్తరణ పనులు చకచకా
జి.మాడుగుల మార్గం వైపు కొత్తపాడేరుకు సమీపంలో వెడల్పు చేసిన రోడ్డు

ఇప్పటికే పాడేరు మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు

ఆక్రమణదారులకు నష్టపరిహారం చెల్లింపు

జి.మాడుగుల వైపు నుంచి పనులు ప్రారంభం

డి.గొందూరు నుంచి పాడేరు శివారు తలారిసింగి వరకు నిర్మాణానికి చర్యలు

పనులు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్యలు పరిష్కారం

పాడేరు- ఆంధ్రజ్యోతి)

జాతీయ రహదారి 516-ఈ నిర్మాణంలో భాగంగా పాడేరులోని మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. రాజమహేంద్రవరం నుంచి విజయనగరానికి నిర్మిస్తున్న జాతీయ రహదారి పనుల్లో భాగంగా పాడేరుకు శివారున 13 కిలోమీటర్ల బైపాస్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో పాడేరులోని మెయిన్‌రోడ్డును సైతం విస్తరించేందుకు నేషనల్‌ హైవే అథారిటీ ముందుకు వచ్చింది.

పాడేరులోని మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు జి.మాడుగుల వైపు నుంచి మొదలయ్యాయి. ఈ మార్గంలోని డి.గొందూరు నుంచి పాడేరు శివారు తలారిసింగి వరకు సుమారుగా ఆరు కిలోమీటర్లు మెయిన్‌రోడ్డును విస్తరించనున్నారు. ఇప్పటికే రోడ్డు విస్తరణకు అవసరమైన స్థలాల ఎంపిక, ఆక్రమణల గుర్తింపు సైతం పూర్తి చేసి, ఆక్రమణల తొలగింపులో నష్టపోతున్నవారికి నష్టపరిహారం సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ క్రమంలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆక్రమణలను సైతం తొలగించాలని హైవే అథారిటీ అధికారులు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు.

చురుగ్గా రోడ్డు విస్తరణ పనులు

మెయిన్‌ రోడ్డు విస్తరణలో భాగంగా డి.గొందూరు వైపు నుంచి రోడ్డును వెడల్పు చేసే పనులు జోరుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లూ సుమారు 34 అడుగుల వెడల్పు ఉండే ఈ రోడ్డును 72 అడుగులకు పెంచుతున్నారు. అలాగే పలు చోట్ల మలుపులు, ఇరువైపులా ఉన్న బండరాళ్లను తొలగిస్తున్నారు. ఎక్కువగా లోతు ఉన్న ప్రదేశాల్లో మట్టితో ఎత్తు చేసే పనులు చేపడుతున్నారు. దీంతో పాడేరు నుంచి జి.మాడుగుల వైపు రోడ్డు విస్తరణతో ఆ మార్గం వెడల్పుగా, చక్కగా కనిపిస్తోంది.

మెయిన్‌రోడ్డు విస్తరణతోనే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం

పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణతోనే ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌ పెట్టగలమని చాలా కాలంగా అధికారులు భావిస్తున్నారు. ఇన్నాళ్లూ రెవెన్యూ డివిజన్‌ కేంద్రం, ఐటీడీఏ ప్రధాన కేంద్రంగా ఉన్న పాడేరు 2022 ఏప్రిల్‌ నుంచి జిల్లా కేంద్రం కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. అలాగే విశాఖపట్నం నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు మీదుగా వెళ్లాలి. ఈ క్రమంలో పాడేరు పట్టణంలో ప్రస్తుతం ఉన్న రోడ్లు ఇరుకుగా ఉండడంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మెయిన్‌రోడ్డు విస్తరణతో ఆయా సమస్యలు పరిష్కారమవుతాయి.

Updated Date - Mar 17 , 2026 | 12:00 AM