Share News

పీపీపీలో రోడ్ల అభివృద్ధి

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:36 AM

నగర పరిధిలోని ప్రధాన రహదారులను పబ్లిక్‌, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు.

పీపీపీలో రోడ్ల అభివృద్ధి

  • రూ.306 కోట్ల వ్యయం

  • 60 ప్రధాన రహదారులు...88.34 కిలోమీటర్లు

  • తొలివిడత రూ.168 కోట్లతో 35 రోడ్లు

  • టెండర్లు పిలిచిన జీవీఎంసీ

  • పని పూర్తికాగానే బిల్లులో 40 శాతం చెల్లింపు

  • మిగిలిన మొత్తం పదేళ్లపాటు చెల్లించేలా నిర్ణయం

  • ఆలోపు రోడ్డు పాడైతే మరమ్మతు బాధ్యత కాంట్రాక్టర్‌దే..

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలోని ప్రధాన రహదారులను పబ్లిక్‌, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేయాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం 88.35 కిలోమీటర్లు పొడవైన 60 రోడ్లను ఎంపిక చేశారు. తొలివిడతగా రూ.168 కోట్లతో 30 రోడ్లను అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు. టెండర్‌ దాఖలుకు వచ్చేనెల 12 వరకు అవకాశం కల్పించారు.

జీవీఎంసీ పరిధిలో రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు అధికారులు నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు వస్తుండడంతో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించారు. అందులో భాగంగా ఇండోర్‌లో మాదిరిగా రోడ్లను పీపీపీ విధానంలో యాన్యుటీ/హైబ్రిడ్‌ యాన్యుటీమోడల్‌ కింద అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో రోడ్ల నిర్మాణంతోపాటు దానిని పదేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కూడా కాంట్రాక్టర్‌కే అప్పగిస్తారు. రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40 శాతం మాత్రమే పనులు పూర్తయిన తర్వాత ఇచ్చి, మిగిలిన బిల్లును పదేళ్లపాటు విడతల వారీగా కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. పదేళ్లలోపు ఆ రోడ్డులో ఎక్కడైనా గుంతలుపడినా, కుంగిపోయినాసరే దానిని పునర్నిర్మించే బాధ్యత ఆ కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రోడ్డు నిర్వహణ కాంట్రాక్టర్‌ సరిగా చేయలేకపోతే జీవీఎంసీ అధికారులు బిల్లు చెల్లింపు నిలిపివేస్తారు. బిల్లు రాదేమోననే భయం ఉంటుందికాబట్టి, రోడ్డు నిర్మాణ సమయంలోనే కాంట్రాక్టర్‌ నాణ్యత పాటిస్తారనేది అధికారుల భావన. భీమిలి, తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ, గాజువాక జోన్‌ల పరిధిలో 88.35 కిలోమీటర్ల నిడివి గల దాదాపు 60 ప్రధాన రోడ్లను పీపీపీ కింద అప్పగించేందుకు కౌన్సిల్‌ ఆమోదం తీసుకున్నారు. తొలివిడత 30 రోడ్లను రూ.168 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు.

Updated Date - Jan 27 , 2026 | 01:36 AM