నత్తనడకన రహదారి నిర్మాణ పనులు
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:26 AM
జీకేవీధి మండలం ఆర్వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న అంతర్ రాష్ట్ర రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడు తున్నారు.
ఆర్వీనగర్- పాలగెడ్డ మార్గంలో మెటల్ వేసి వదిలేసిన వైనం
వాహనాల రాకపోకలకు ఇబ్బందులు
సీలేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): జీకేవీధి మండలం ఆర్వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న అంతర్ రాష్ట్ర రహదారి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడు తున్నారు. కేవలం రాళ్లు పరిచి వదిలేయడంతో వాహనాల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. ఈ మార్గంలో బుధవారం రెండు కార్లు, ఒక ట్రాక్టర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ రహదారి నిర్మాణ పనులపై ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ఈ రహదారి గోతులతో దారుణంగా ఉండడంతో రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.18.5 కోట్లు మంజూరు చేసింది. గత సెప్టెంబరు నెలలో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే పనులను నాణ్యతతో చేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ధారాలమ్మ ఘాట్ రోడ్డుపై ఇటీవల 20 ఎంఎం మెటల్ వేసి వదిలేశారు. దానిపై క్రషర్ బుగ్గి గానీ, గ్రావెల్ గానీ వేయకుండా వదిలేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్వీనగర్ నుంచి పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణ పనుల ఆలస్యంపై పాడేరు ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాసరావును వివరణ కోరగా నర్సీపట్నంలో స్టోన్ క్రషర్లు మూతపడ్డాయని, దాని వలన పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. త్వరలో ఈ సమస్యను అధిగమించి పనులు వేగంగా జరిగేలా చూస్తామని ఆయన తెలిపారు.