Share News

శరవేగంగా రహదారి నిర్మాణ పనులు

ABN , Publish Date - Feb 22 , 2026 | 11:18 PM

జిల్లాలో రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అరకులోయ, అనంతగిరి మండలాలను కలుపుతూ చేపడుతున్న రోడ్డు నిర్మాణం జోరందుకుంది.

శరవేగంగా రహదారి నిర్మాణ పనులు
నిర్మాణంలో ఉన్న బొండాం కొత్తవలస- కితలంగి రోడ్డు

పూర్తికానున్న బొండాం కొత్తవలస- కితలంగి రోడ్డు

అరకులోయ, అనంతగిరి మండలాలను కలుపుతూ నిర్మాణం

తీరనున్న పలు గ్రామాల ప్రజల రవాణా కష్టాలు

అరకులోయ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అరకులోయ, అనంతగిరి మండలాలను కలుపుతూ చేపడుతున్న రోడ్డు నిర్మాణం జోరందుకుంది. ముఖ్యంగా రెండు మండలాలను కలుపుతూ నిర్మిస్తున్న బొండాం కొత్తవలస- కితలంగి రోడ్డు పనులు ఊపందుకున్నాయి. వచ్చే నెలలోగా పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే అరకులోయ, అనంతగిరి మండలాల పరిధిలో ఉన్న బొండాం, గన్నెల, లోతేరు, సుంకరమెట్ట, అలాగే అనంతగిరి మండల పరిధిలో బొర్రా, కోనాపురం గ్రామాల ప్రజలకు రవాణా కష్టాలు తీరతాయి. ప్రధానంగా సుంకరమెట్ట వారపు సంతకు అటవీ ఉత్పత్తులను తీసుకువెళ్లడానికి గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

జయంతివలస- కొత్తవలస రోడ్డు కూడా పూర్తయితే..

అరకులోయ మండలం బొండాం పంచాయతీ పరిధిలో ఉన్న కరకవలస, జయంతివలస, కొల్యగుడ గ్రామం మీదుగా బొండాం కొత్తవలసకు నిర్మిస్తున్న రోడ్డు కూడా పూర్తయితే పలు గ్రామాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి జయంతివలస నుంచి పెద్దగెడ్డ వంతెన వరకు తారురోడ్డు నిర్మించారు. పెద్దగెడ్డ వంతెన నుంచి కొల్యాగుడ మీదుగా బొండాం కొత్తవలస వరకు తారురోడ్డు నిర్మాణంలో భాగంగా మెటల్‌ వేసి రెండు నెలల క్రితం పనులు అర్ధంతరంగా నిలిపివేశారు. రాళ్లు తేలి ఉండడంతో ఈ మార్గంలో ప్రయాణించేందుకు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు పూర్తయితే నేరుగా కరకవలస నుంచి కొత్తవలస, బొండ్యాగుడ, కోనాపురం, చప్పాడి, బొర్రాకు చేరుకోవచ్చు. ఘాట్‌రోడ్డుకు బదులు బొర్రాకు వెళ్లేందుకు ఇది ప్రత్యామ్నాయ రహదారిగా ఉపయోగపడుతుంది. బొర్రాకు చేరుకునేందుకు దూరం తగ్గుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారి నిర్మాణం పూర్తి చేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 11:18 PM