శ్రమదానంతో రహదారి నిర్మాణం
ABN , Publish Date - May 12 , 2026 | 11:30 PM
రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న మండలంలోని గాంకొండ గ్రామస్థులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. దీంతో శ్రమదానంతో మట్టి రహదారిని నిర్మించుకున్నారు.
అధికారులు స్పందించకపోవడంతో నడుంబిగించిన గాంకొండ గ్రామస్థులు
రాకపోకలకు అనువుగా మట్టి రోడ్డు ఏర్పాటు
కొయ్యూరు, మే 12 (ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న మండలంలోని గాంకొండ గ్రామస్థులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. దీంతో శ్రమదానంతో మట్టి రహదారిని నిర్మించుకున్నారు.
మండలంలోని నడింపాలెం పంచాయతీ గాంకొండ గ్రామానికి గత ఏడాది నడింపాలెం వంతెన నుంచి ఐదు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించి మిగతా రెండు కిలోమీటర్లు వదిలేశారు. అంతే కాకుండా ఈ రహదారి పొడవున గల ఐదు కల్వర్టుల నిర్మాణానికి సిమెంటు తూరలు తెచ్చి కల్వర్టు నిర్మాణ ప్రదేశాల్లో గోతులు తవ్వి వదిలేశారు. దీంతో గత ఎనిమిది నెలలుగా గాంకొండ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామస్థులు శ్రమదానంతో రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మట్టి రోడ్డు స్థానంలో బీటీ రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు. దీనిపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ జేఈ రామకృష్ణను వివరణ కోరగా, నడింపాలెం వంతెన నుంచి మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించామని, మిగతా రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు రాగానే పనులు పూర్తి చేస్తామని చెప్పారు.