రోడ్ల నిర్మాణం సత్వరం పూర్తికావాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:26 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా నిర్మించతలపెట్టిన రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు.
అధికారులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశం
భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రహదారుల పరిశీలన
విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్‌పోర్టుకు అనుసంధానంగా నిర్మించతలపెట్టిన రోడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, వీఎంఆర్‌డీఏ అధికారులతో కలిసి పెందుర్తి, వేపగుంట, జుత్తాడ, పినగాడి వరకు ఉన్న అనుసంధాన రోడ్లను ఆదివారం ఆయన పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో సమస్యలుంటే సంబందిత విభాగాల అధికారులతో సంప్రదింపులు జరిపి, సత్వరం పనులు పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సీసీపీ ఎ.ప్రభాకరరావు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు తదితరులున్నారు.
28న జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం
విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ సర్వసభ్య సమావేశం ఈనెల 28న నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ మేరకు అజెండా సిద్ధం చేసి, ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ ప్రస్తుత కార్యవర్గం ఐదేళ్ల పదవీకాలం వచ్చేనెల 17తో ముగుస్తుంది. దానికి పదిరోజులు ముందు ఎలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో 28న జరిగే సమావేశమే ప్రస్తుత కార్యవర్గానికి చివరిది. ఈ నేపథ్యంలో అజెండాలో భారీగా అంశాలను చేర్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
8ఏడీఎన్3 రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నారాయణరావు, అసోసియేట్ అధ్యక్షుడు పున్నయ్య, అధ్యక్షుడు సత్తిబాబు, ప్రధాన కార్యదర్శి సీతారామరాజు (ఎడమ నుంచి కుడికి)
పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
విశాఖపట్నం, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖ జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికలు ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగాయి. అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు (విశాఖ ప్రాజెక్ట్సు డివిజన్ సూపరింటెండెంట్), ప్రధాన కార్యదర్శిగా డీవీ సీతారామరాజు (నక్కపల్లి మండల పరిషత్ ఏవో), అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య (పెదబయలు మండల పరిషత్ ఏవో), ఉపాధ్యక్షుడిగా ఆర్వీ నాగరాజు (జడ్పీ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్), డీవీఎస్ గౌరీపతిరావు (చోడవరం పీఆర్ డివిజన్ సీనియర్ అసిస్టెంట్), పి.శ్రీనివాసు (రోలుగుంట మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్) ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధరరావు (కొత్తకోట జడ్పీ పాఠశాల జూనియర్ అసిస్టెంట్), ఎస్.త్రినాథరావు (సబ్బవరం మండల పరిషత్ ఏవో), సీహెచ్ సింహాచలం (మాడుగుల మండల పరిషత్ టైపిస్టు), జీఎల్ నరసింహారావు (అనకాపల్లి ఆర్‌డబ్ల్యూఎస్ జూనియర్ అసిస్టెంట్), సంయుక్త కార్యదర్శులుగా పి.రామకృష్ణ (జడ్పీలో సీనియర్ అసిస్టెంట్), ఎంవీహెచ్‌ఆర్ స్వామి (రావికమతం మండల పరిషత్ ఏవో), వై.రామకృష్ణ (నర్సీపట్నం మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్), కార్యనిర్వాహక కార్యదర్శులుగా జి.సుధారాణి (కె.కోటపాడు పీఆర్ సబ్‌డివిజన్ ఏవో), డీవీ రమణరాజు (రాంబిల్లి మండల పరిషత్ ఏవో), ఎస్.రవికుమార్ (భీమిలి మండల పరిషత్ జూనియర్ అసిస్టెంట్), బీవీఎస్ ఫణికుమార్ (దేశపాత్రునిపాలెం హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి వ్యవహరించారు.