Share News

రోడ్డు ప్రమాదాలు తగ్గాలి

ABN , Publish Date - Mar 13 , 2026 | 01:01 AM

విశాఖపట్నం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాలని, ముఖ్యంగా బ్లాక్‌ స్పాట్లపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నా చంద్రబాబునాయుడు సూచించారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గాలి

పటిష్ఠ ప్రణాళిక రూపొందించండి

కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు సీఎం సూచన

బ్లాక్‌ స్పాట్లపై దృష్టి పెట్డండి

పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలి

పోషకాహారం పంపిణీలో విశాఖ జిల్లా టాప్‌

విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాలని, ముఖ్యంగా బ్లాక్‌ స్పాట్లపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి నా చంద్రబాబునాయుడు సూచించారు. ఆయన అమరావతిలో గురువారం కలెక్టర్లు, ఎస్పీలు/పోలీస్‌ కమిషనర్‌ల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని, రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని విశాఖ జిల్లా అధికారులకు సూచించారు. పోలీసులు, రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ విషయాల్లో కఠినంగానే ఉండాలని, ఎవరినీ ఉపేక్షించవద్దని సూచించారు. బ్రీత్‌ ఎనలైజర్లు, స్పీడ్‌ గన్ల కొనుగోలుకు నిధులు ఇచ్చామని గుర్తుచేశారు. బ్లాక్‌ స్పాట్లకు కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ ఇద్దరూ వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ జిల్లాలో 2024లో రోడ్డు ప్రమాదాల్లో 331 మంది మరణిస్తే 2025లో 347 మంది చనిపోయారని, ఇది తగ్గాలన్నారు. ప్రమాదాల సంఖ్య 2024లో 1,131 కాగా 2025లో 1,110కి తగ్గిందన్నారు. మహిళలపై గృహ హింస కేసుల్లోను తగిన చర్యలు చేపట్టాలన్నారు. దీనికి ముందు జిల్లాల వారీగా డేటాను విశ్లేషించారు.

- పిల్లలకు, బాలింతలకు, అంగన్వాడీల్లో పోషకాహారం గుడ్లు, పాలు వంటివి అందించడంలో విశాఖపట్నం జిల్లా 90.6 శాతంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

- జిల్లాలో 1,24,844 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా అందులో 87,953 పూర్తయ్యాయి. ఉగాది నాటికి మరో 21,626 పూర్తి చేయాలని లక్ష్యం ఇచ్చారు.

- వాణిజ్య పన్నుల వసూళ్లలో విశాఖ జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. ప్రభుత్వం రూ.25,599 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యం ఇవ్వగా, అందులో రూ.18,283 కోట్లు మాత్రమే సాధించారు.

- ఎక్సైజ్‌ వసూళ్లలో జిల్లా 12వ ర్యాంక్‌ సాధించింది. రూ.1,847.45 కోట్లు సాధించాలని లక్ష్యం ఇవ్వగా, 1,744 కోట్లు వసూలు చేశారు.

- రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో 15వ స్థానం దక్కించుకుంది. రూ.1,268.56 కోట్లు లక్ష్యం ఇవ్వగా, రూ.1,147 కోట్లు సాధించింది.

- వాహనాలకు పన్నుల వసూళ్లలో జిల్లా 24వ స్థానంలో నిలిచింది. రూ.551.71 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.402 కోట్లు వచ్చింది.

- జీవీఎంసీలో ఆస్తి పన్ను రూ.640.18 కోట్లకు రూ.363.29 కోట్లు వసూలైంది.


ప్రజా సానుకూలతలో 8వ స్థానం

విశాఖపట్నం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి వచ్చే సానుకూల స్పందనలో విశాఖ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రత్యేక వ్యవస్థ ద్వారా ప్రతి జిల్లాలో ప్రజల నుంచి ప్రభుత్వ పథకాల అమలు, సమస్యల పరిష్కారంలో అధికారుల చొరవ, తదితర అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత డిసెంబరులో ఈ విధంగా అభిప్రాయాలు సేకరించినప్పుడు విశాఖ జిల్లాలో 70.7 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు మళ్లీ అదే అభిప్రాయ సేకరణ చేయగా ఆ స్కోర్‌ 72.3 శాతానికి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా 74.1 స్కోర్‌తో ప్రథమ స్థానంలో నిలవగా పల్నాడు, కృష్ణా, తూర్పు గోదావరి, ఎల్లూరు, గుంటూరు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

Updated Date - Mar 13 , 2026 | 01:01 AM