హైవేపై రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jun 17 , 2026 | 11:52 PM
మండలంలోని నామవరం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి.
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొన్న ఆటో
ఒకరి మృతి, ఏడుగురికి గాయాలు
పాయకరావుపేట రూరల్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నామవరం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో నక్కపల్లి నుంచి తుని వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో నామవరం జాతీయ రహదారిపై ఆగి ఉన్న వ్యాన్‌ను బలంగా ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి 108 సిబ్బంది పెదకాపు రాము, టి.శ్రీనివాస్ ప్రాఽథమిక చికిత్స చేసి వెంటనే తుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 10 గంటలకు నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన షేక్ షీలాబిరి(53) మృతి చెందింది. వీరిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా చినదొడ్డిగల్లు, ఉద్దండపురం, డొంకాడ గ్రామాలకు చెందిన వారు. ఆటో డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎస్‌ఐ రమణ తెలిపారు. క్షతగాత్రుడు బేతా సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. తుని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం షేక్ షీలాబిరి మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని తెలిపారు.