ఏజెన్సీలో రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:32 AM
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గోపాలపట్నానికి చెందిన యువకుడి మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
అరకు వెళ్లి వస్తుండగా కారును ఢీకొన్న బైక్
అనంతగిరి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి):
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి ఏఎస్‌ఐ రాజంనాయుడు తెలిపిన వివరాలా ఉన్నాయి. విశాఖ నగరంలోని గోపాలపట్నం ఇందిరానగర్ కాలనీకి చెందిన నామాల సతీశ్ (19), లాలం తేజ, శ్రీను శనివారం ద్విచక్ర వాహనంపై లంబసింగి వచ్చారు. అక్కడ నుంచి అరకు వచ్చారు. సోమవారం ఉదయం విశాఖపట్నం బయలుదేరారు. అయితే చిలకలగెడ్డ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సతీశ్ అక్కడికక్కడే మృతిచెందగా, లాలం తేజ, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు సతీశ్ విశాఖలోని అల్వార్‌దాస్ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఏఎస్‌ఐ రాజంనాయుడు కేసు నమోదు చేసి మృతదేహానికి ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.