రింతాడలో రోడ్డు ప్రమాదం
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:44 PM
పెదవలస-చింతపల్లి జాతీయ రహదారి రింతాడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ద్విచక్రవాహనం, ఆటోని ఢీకొట్టిన యువకులు
ఒకరి మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
చింతపల్లి/గూడెంకొత్తవీధి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పెదవలస-చింతపల్లి జాతీయ రహదారి రింతాడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
చింతపల్లి మండలం బలపం పంచాయతీ కుడుముల గ్రామానికి చెందిన గబులంగి శివరామ్, గింజంగి గ్రామానికి చెందిన మొట్టడం జోగిరాజు ద్విచక్రవాహనంపై చింతపల్లి నుంచి జీకేవీధి వెళుతున్నారు. చింతపల్లి నుంచి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై పరిమితికి మించిన వేగంతో వెళుతూ.. పెంటపాడు వంతెన దాటిన తరువాత బైక్‌పై రింతాడ వెళుతున్న మాడెం గ్రామానికి చెందిన పాంగి దేవరాజు, భార్య, మూడేళ్ల బాబుతో వాహనాన్ని శివరామ్ వాహనం ఢీకొని ఆగకుండా ముందుకు వెళ్లిపోయారు. దీంతో దేవరాజు, హైమావతి, బాబు రోడ్డుపై పడిపోయి గాయపడ్డారు. అక్కడ నుంచి 200 మీటర్ల దూరం ప్రయాణించిన శివరామ్ ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న మొట్టడం జోగిరాజు 20 అడుగుల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వాహనం నడుపుతున్న శివరామ్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో రోడ్డుపై పడిపోయాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సలిమిత నాగేశ్వరరావు, బాబూరావు, చింతల్లి, జర్తా పాపారావు, లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరు జి.మాడుగుల మండలం కిముడుపల్లి నుంచి నిమ్మలపాలెం గ్రామంలో మృతి చెందిన బంధువుల అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడగా.. డ్రైవర్ రవి స్వల్పగాయాలతో బయపడ్డాడు. క్షతగాత్రులను 108లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకు రాగా.. వైద్యాధికారి రుక్మిణి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కి తరలించారు. ద్విచక్రవాహనం నడుపుతున్న శివరామ్, ఆటోలో ప్రయాణిస్తున్న నాగేశ్వరరావు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టు జీకేవీధి పోలీసులు తెలిపారు.