కబళించిన కారు
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:53 PM
అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం ఇరువాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేపీఆర్‌వీఎన్ ప్రసాద్ మృతి చెందారు.
బైక్‌పై హెడ్ కానిస్టేబుల్ వెళుతుండగా వెనుక నుంచి ఢీ
అక్కడికక్కడే మృతి
జాతీయ రహదారిపై ఇరువాడ జంక్షన్ వద్ద ఘటన
సబ్బవరం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం మండలం ఇరువాడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేపీఆర్‌వీఎన్ ప్రసాద్ మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మాడుగుల మండలం జమ్మాదేవిపేటకు చెందిన కేపీఆర్‌వీఎన్ ప్రసాద్ పరవాడ పీఎస్ పరిధిలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు ఆయన సుజాతనగర్ నుంచి బైక్‌పై జాతీయ రహదారి మీదుగా అనకాపల్లి బయలుదేరారు. ఇరువాడ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయన బైక్‌ను ఢీకొంది. దీంతో ప్రసాద్ రోడ్డుపై పడిపోయి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సింహాచలం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్‌కు భార్య తులసి, కుమార్తె కీర్తి, కుమారుడు తేజ ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రామచంద్రరావు తెలిపారు.
సుదీర్ఘ కాలం విశాఖలో సేవలు
ప్రసాద్ 2000లో విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. టూ టౌన్, ఫోర్త్ టౌన్ శాంతి భద్రతల విభాగం, హార్బర్, స్టీల్‌ప్లాంట్, పెందుర్తి ట్రాఫిక్, ఎంవీపీ కాలనీ క్రైమ్, విశాఖపట్నం సిటీ స్పెషల్ బ్రాంచీల్లో సేవలందించారు. 2022లో ప్రసాద్‌ను అనకాపల్లి జిల్లాకు కేటాయించారు. పరవాడ పీఎస్ పరిధిలో ఆయన సేవలు అందించారు. ఇటీవల ప్రసాద్ కుమారుడు బీటెక్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ తుహిన్‌సిన్హా నగదు పురస్కారం, ప్రశంసాపత్రం అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధత గలిగిన మంచి మిత్రుడిని కోల్పోయామని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రసాద్ కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ తుహిన్‌సిన్హా ఒక ప్రకటనలో తెలిపారు.