రహదారుణం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:57 AM
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం (కనెక్టివిటీ) కోసం వీఎంఆర్‌డీఏ హడావిడిగా నిర్మించిన వేపగుంట-పినగాడి మాస్టర్‌ప్లాన్ రోడ్డు ఇంకా వాహనాల రాకపోకలు సరిగా ప్రారంభం కాకముందే కుంగిపోయింది.
కుంగిపోయిన వేపగుంట-పినగాడి రోడ్డు
భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టివిటీ కోసం రూ.14 కోట్లతో నిర్మాణం
ప్రారంభం కాకముందే బయటపడిన నాణ్యతాలోపం
పెందుర్తి/వేపగుంట ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానం (కనెక్టివిటీ) కోసం వీఎంఆర్‌డీఏ హడావిడిగా నిర్మించిన వేపగుంట-పినగాడి మాస్టర్‌ప్లాన్ రోడ్డు ఇంకా వాహనాల రాకపోకలు సరిగా ప్రారంభం కాకముందే కుంగిపోయింది. కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన ఏడు రహదారుల్లో వేపగుంట-పినగాడి రోడ్డే అత్యంత కీలకమైంది. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు గోతులమయంగా ఉండేది. ఎయిర్‌పోర్టు అనుసంధాన మార్గాల్లో ఒకటిగా గుర్తించడంతో సుమారు 14 కోట్ల రూపాయలతో 3.9 కిలోమీటర్ల మేర 60 అడుగుల వెడల్పున విస్తరించారు. రోడ్డు పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. కల్వర్టుల నిర్మాణాలు కావాల్సి ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వేపగుంట సమీపాన శేషాద్రినగర్ వద్ద రహదారి కుంగిపోయింది. ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల క్రితం వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో నీరు చేరింది. అదేవిధంగా రహదారికి ఇరుపక్కలా భూగర్భంలో 1000 డీఐ (డక్ట్ ఐరన్) తాటిపూడి పైపులైన్లు ఉన్నాయి. నీరు విడుదల చేసే క్రమంలో ఈ డీఐ పైపులైనుకు అనుసంఽధానమైన షోల్డర్లు అధిక ఒత్తిడికి గురై పగిలి పోవడంతో అక్కడున్న రోడ్డు దెబ్బతిని ఉండవచ్చునని కొందరు అంటున్నారు. అయితే పైపులైన్ ఒత్తిడికి రహదారికేమీ కాదని, నాణ్యత లేక కుంగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వర్షం పడితే ఈ రహదారిపై ఎక్కడికక్కడ నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. లక్ష్మీపురం రైల్వే వంతెన దాటిన తరువాత కూడా అనేకచోట్ల పగుళ్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా విషయంపై దృష్టిసారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కైలాసగిరిపై వ్యాపారుల ఇష్టారాజ్యం
లీజుకు తీసుకున్నది తక్కువ...ఆక్రమించినది ఎక్కువ
అడిగితే గొడవలు
విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
కైలాసగిరిపై కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ కేటాయించిన స్థలం కొంత అయితే దానికి రెండు, మూడు రెట్లు ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అడిగితే గొడవలకు దిగుతున్నారు.
ఇటీవల కైలాసగిరిపై కొత్త కొత్త ప్రాజెక్టులు గ్లాస్ బ్రిడ్జి, త్రిశూలం, స్కై సైక్లింగ్, జిప్‌లైనర్ వంటివి అందుబాటులోకి రావడంతో సందర్శకుల సంఖ్య పెరిగింది. శని, ఆదివారాల్లో కైలాసగిరి మార్గాలన్నీ జామ్ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కైలాసగిరిపై వ్యాపారం కూడా పెరిగింది. దాంతో పలుకుబడి కలిగిన వారంతా అక్కడ 200 గజాల నుంచి 500 గజాల వరకు స్థలాలను లీజుకు తీసుకొని టిఫిన్లు, డ్రింకులు, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీములు వంటివి విక్రయిస్తున్నారు. అయితే కొందరు కేటాయించిన స్థలం కంటే అధిక విస్తీర్ణం ఆక్రమించారు. ఫుడ్ కోర్టు కాంప్లెక్స్‌లో ఫుడ్ కోర్టు-1 నిర్వహించే బి.రమణకు వీఎంఆర్‌డీఏ 400 గజాలు, నెలకు రూ.29,600 లీజుకు కేటాయించింది. కానీ అతను గత రెండేళ్లుగా 1,800 గజాల స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా అటఇటు ఉన్న వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నాడు. దీనిపై వారు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ నిర్వహించారు. పక్క షాపుల వారిపై దాడికి కూడా దిగినట్టు వీడియో రికార్డుల ద్వారా బయటపడింది. దాంతో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దానికి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అతడికి కేటాయించిన స్థలం లీజును రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ ఆదేశాలు ఉన్నతాధికారుల ఆమోదంతో జారీ కావలసి ఉంది. అలాగే అతడి నుంచి అదనపు ఏరియాకు అదనపు మొత్తాలు కూడా వసూలు చేయాల్సి ఉంది. దీనిపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఉత్తర్వులు జారీ కాకుండా అడ్డుకుంటున్నట్టు తెలిసింది. ఇదే తరహాలో మరికొందరు కేటాయించిన స్థలాలు కంటే అదనంగా వినియోగిస్తున్నారని, వాటిని కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి వారు కోరుతున్నారు.
హార్బర్‌లో మత్స్య శాఖాధికారుల పర్యటన
విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మత్స్య శాఖాధికారుల బృందం శనివారం ఫిషింగ్ హార్బర్‌లో పర్యటించింది. వేటాడి తెచ్చిన చేపలను ఎలా హార్బర్‌కు చేరుస్తున్నారు?, ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారు?, వేలం పాటల నిర్వహణ, కోల్ట్ స్టోరేజీ సదుపాయాలు, చేపల ఎగుమతులు వంటివి పరిశీలించారు. ఫింగర్ జెట్టీలో బోట్లకు ట్రాన్స్‌పాండర్లు, బీమా సదుపాయాలు ఉన్నాయా? లేవా?...అని అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సెక్రటరీ శుభంజన్ దాస్, మత్స్య శాఖ కార్యదర్శి మోనాలిసా మైటీ, మరో అధికారి సిద్ధార్థ సర్కార్, ఎంపెడా అధికారులు, రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వా కల్చర్ శాస్త్రవేత్తలు, విశాఖపట్నం పోర్టు ఇంజనీరింగ్ విభాగం అధికారులు, మెరైన్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.