విశాఖకు ఆర్‌ఎంజడ్ బృందం
ABN , Publish Date - Jan 29 , 2026 | 04:43 AM
బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజడ్ కార్పొరేషన్ ప్రతినిధులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐటీ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను బుధవారం పరిశీలించారు.
భూములు పరిశీలన.. డేటా సెంటర్, జీసీసీ ఏర్పాటుకు దావోస్‌లో ఎంఓయూ
విశాఖపట్నం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజడ్ కార్పొరేషన్ ప్రతినిధులు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఐటీ సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఏపీఐఐసీ అధికారులు వారికి భూములు చూపించారు. రాబోయే ఐదారేళ్లలో ఏపీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఇటీవల దావోస్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఆర్‌ఎంజడ్ గ్రూపు ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా విశాఖపట్నంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్, 50 ఎకరాల్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ తొలుత ఏర్పాటు చేస్తామని ప్రభుత్వానికి తెలిపింది. వాటికి అవసరమైన భూములు చూసుకోవడానికి ఆర్‌ఎండీ ఇన్‌ఫ్రా ప్రెసిడెంట్ దీపక్ ఛాబ్రియా, సూపర్‌వైజరీ బోర్డు చైర్ రాజ్ మెండా తదితరులు బుధవారం విశాఖపట్నం వచ్చారు. అధికారుల బృందం వారికి మూడు ప్రాంతాల్లో భూములు చూపించింది. విజయనగరంలో ఒకచోట, విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం, విశాఖపట్నం నగర శివార్లలోని కాపులుప్పాడ ఐటీ లేఅవుట్‌లో భూములను చూపించారు. త్వరలోనే ఎక్కడ? ఎంతెంత? భూములు కేటాయించేదీ తెలుస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.