ఆర్‌ఐటీఐ విద్యార్థినిది హత్యే
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:04 AM
అరకులోయ సమీపంలో హైవే చొంపి బ్రిడ్జి వద్ద ఈనెల 18వ తేదీన ఆర్‌ఐటీఐ విద్యార్థిని కిల్లో మీనాక్షి (19) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు.
పెళ్లి చేసుకోమని అడిగినందుకు హత్య
సహకరించిన ఇద్దరు స్నేహితులు
నిందితులు ముగ్గురూ ఆర్‌ఐటీఐ విద్యార్థులే
పాడేరు ఎస్‌డీపీవో రాజసింహారెడ్డి
అరెస్టు చేసిన పోలీసులు
24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
అరకులోయ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): అరకులోయ సమీపంలో హైవే చొంపి బ్రిడ్జి వద్ద ఈనెల 18వ తేదీన ఆర్‌ఐటీఐ విద్యార్థిని కిల్లో మీనాక్షి (19) అనుమానాస్పద మృతి కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. విద్యార్థిని మీనాక్షిని పథకం ప్రకారం హత్య చేశారని, నిందితులంతా ఆర్‌ఐటీఐ విద్యార్థులేనని, వారిని అరెస్టు చేశామని పాడేరు ఎస్‌డీపీవో రాజసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ పోలీస్ స్టేషన్‌లో సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావులతో కలిసి పాడేరు ఎస్‌డీపీవో రాజసింహరెడ్డి విలేకర్లతో మాట్లాడారు. వారిచ్చిన వివరాలిలా ఉన్నాయి.
అరకులోయ ఆర్‌ఐటీఐలో మొదటి సంవత్సరం ఎలకా్ట్రనిక్స్ చదువుతున్న కిల్లో మీనాక్షి, ఆర్‌ఐటీఐలో డీజిల్ మెకానిక్‌లో చదువుతున్న తామర్ల పవన్‌కుమార్(19) ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం డుంబ్రిగుడ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి జరుగుతున్నది. మీనాక్షీ ఎన్టీఆర్ గ్రౌండ్స్ సమీపంలో అద్దెకు రూమ్ తీసుకొని ఆర్‌ఐటీఐకి వెళుతుండేది. వీరిద్దరు ఐటీఐకు వెళ్లి రావడం, రూంకు మీనాక్షిని పవన్‌కుమార్ డ్రాప్ చేయడం, రూమ్‌లో తోడుగా ఉండడం కొనసాగుతూ ఉండేది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఐటీఐలో తెలిసిపోయింది. దీంతో పెళ్లి చేసుకుందామని పవన్‌కుమార్‌పై మీనాక్షి ఒత్తిడి పెంచింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఇంట్లో వివాహం విషయం చెబితే ఎటువంటి సమస్యలు వస్తాయోనని పవన్‌కుమార్ ఆందోళనకు గురయ్యాడు. అలాగే మీనాక్షికి భరోసా ఇవ్వలేకపోయాడు. దీంతో ఆమెను అడ్డు తొలగించుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించి.. మీనాక్షిని హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చాడు. దీంతో అదే ఐటీఐలో చదువుతున్న తన స్నేహితులైన త్రినాథ్, మరో విద్యార్థిచైల్డ్)తో మీనాక్షిని చంపేందుకు సాయం కోరాడు. దీంతో స్నేహితులిద్దరూ అంగీకరించారు. దీంతో పథకం ప్రకారం బుధవారం రాత్రి 8.00 గంటలకు పవన్, మీనాక్షిని స్కూటీపై చొంపి బ్రిడ్జి వద్దకు తీసుకు వెళ్లి అక్కడ కొట్టి గాయపరిచాడు. అనంతరం స్నేహితులు రావడంతో ముగ్గురు కలిసి కొనప్రాణంతో ఉన్న మీనాక్షిని బ్రిడ్జి కిందకు తీసుకువెళ్లి మళ్లీ కొట్టి చంపేశారు. అయితే మీనాక్షి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించేందుకు బ్రిడ్జి కింద గెడ్డ ఒడ్డున పడేశారు. మీనాక్షి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్నారు. ఈ నేపథ్యంలో సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, 24 గంటల్లో నిందితులను గుర్తించి హత్య వివరాలను సేకరించామని పాడేరు ఎస్‌డీపీవో రాజసింహరెడ్డి తెలిపారు. ఈ కేసులో సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ మల్లేశ్వరరావు, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, కేసును కొలిక్కి తీసుకువచ్చారన్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఎస్‌డీపీవో రాజసింహరెడ్డి అభినందించారు.