జలాశయాల్లో పెరుగుతున్న నీటిమట్టాలు
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:29 PM
ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్సులోని జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాల నీటిమట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి.
డొంకరాయి నుంచి 2 వేల క్యూసెక్కులు, ఏవీపీ డ్యామ్ నుంచి 6,500 క్యూసెక్కులు దిగువకు విడుదల
సీలేరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు కాంప్లెక్సులోని జలాశయాల్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయాల నీటిమట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుతున్నాయి. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమయ్యారు. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 1,032 అడుగులకు చేరింది. భారీ వర్షాలు కొనసాగు తున్నందున సుమారు 15 వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వస్తుందని జెన్‌కో అధికారులు అంచనా వేశారు. దీంతో ఒక గేటు ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరకుండా చర్యలు చేపట్టారు. అలాగే డొంకరాయి ఏవీపీ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 937 అడుగులు కాగా, సుమారు 9 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో నీటిమట్టం 932 అడుగులకు చేరింది. దీంతో ఏవీపీ డ్యామ్ రెండు గేట్లు ఎత్తి 6,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే గుంటవాడ జలాయంలోకి పిల్లిగెడ్డ వాగు నుంచి 10 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఇక్కడ పూర్తిస్థాయి నీటిమట్టం 1,360 అడుగులు కాగా, గురువారం సాయంత్రానికి 1,355 అడుగులకు చేరింది. సీలేరు కాంప్లెక్సులోని జలాశయాల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సీఈ రాజారావు, ఎస్‌ఈ బాలకృష్ణ తెలిపారు.
డుడుమ నుంచి నీరు విడుదల
డుడుమ జలాశయం నీటి నిల్వలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. జలాశయానికి 2,590 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, గురువారం 2,588.4 అడుగులకు చేరింది. వరద నీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడం వలన ప్రస్తుతం జలాశయం 6వ నంబరు గేటు నుంచి 4 వేల క్యూసెక్కులు, 7వ నంబరు గేటు నుంచి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతంలో గల బలిమెలకు మొత్తం 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ జలాశయానికి ఎగువ ప్రాంతంలో ఉన్న జోలాపుట్టు ప్రధాన జలాశయంలో సైతం వరదనీరు వచ్చి చేరుతోంది. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,740 అడుగులకు చేరింది.